China: కనిపించకుండా పోయిన రక్షణ మంత్రిని పదవి నుంచి తొలగించిన చైనా

ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్‌లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.

Gen Li Shangfu: దాదాపు రెండు నెలలగా అదృశ్యమైన రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫును అధికారికంగా తొలగించినట్లు చైనా ఎట్టకేలకు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వెలువరించింది. ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్‌లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.

దేశంలోని అగ్రశ్రేణి చట్టసభ సభ అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీలోని సభ్యులు కూడా రక్షణ మంత్రిని తొలగించాలని ఓటు వేశారు. ఇక ఇదే సమయంలో యిన్ హెజున్‌ను చైనా సైన్స్-టెక్నాలజీ మంత్రిగా, లాన్ ఫ్యాన్‌ను ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ నియమించింది. జూలైలో విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌ను ఆకస్మికంగా భర్తీ చేసిన తర్వాత మూడు నెలల్లో చైనాలో జరిగిన రెండవ పెద్ద మార్పు ఇది.

లీ చివరిసారిగా ఆగస్టు 29న కనిపించారు
చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా శాంతి-భద్రతా ఫోరమ్‌లో ప్రసంగించినప్పుడు బహిరంగంగా కనిపించారు. దీనికి ముందు చైనా కూడా ఇటీవల తన విదేశాంగ మంత్రిని తొలగించింది. చైనా విదేశాంగ మంత్రి కూడా చాలా రోజులుగా కనిపించకుండా పోయారు. ఈ ఏడాది మార్చిలో లీ ఆ పదవికి నియమితులయ్యారు. అలాగే, ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక ప్రకారం.. రక్షణ మంత్రి లీ షాంగ్ఫు అదృశ్యం కావడానికి వారం రోజుల ముందు అధికారులు ఆయనను విచారణకు తీసుకెళ్లారు. అవినీతి కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది.

రక్షణ మంత్రిగా లీ పదోన్నతి పొందారు
చైనా సైన్య ఆయుధ సరఫరా విభాగానికి నాయకత్వం వహించిన లీ షాంగ్‌ఫు ఇటీవలే పదోన్నతి పొంది చైనా రక్షణ మంత్రిగా చేశారు. దీనికి ముందు లీ షాంగ్‌ఫు 2017 నుంచి ఐదేళ్ల పాటు ఆయుధాల సేకరణకు బాధ్యత వహించారు.