చైనాలో ప్లేగు కేసుల ఆందోళన ..ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్

  • Publish Date - August 10, 2020 / 09:46 AM IST

కరోనా మహమ్మారిని ప్రపంచ దేశాలకు అంటించి..తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనా దేశం మరో వ్యాధి ప్రాణాంతకంగా తయారైంది. బోనిక్ ప్లేగు వ్యాధి డ్రాగన్ దేశానికి మరో షాక్ ఇచ్చింది. బోనిక్ ప్లేగు రోజురోజుకు విస్తరిస్తూ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.



చైనాలోని మంగోలియాలోని ఓ గ్రామంలో బుబోనిక్ ప్లేగు సోకి ఓ వ్యక్తి మరణించాడు. దీంతో చైనా అధికారులు అప్రమత్తమై ఆ గ్రామం మొత్తాన్ని సీల్ చేశారు. ఎవరూ గ్రామంలోకి వెళ్లకుండా, గ్రామస్తులు బయటకు రాకుండా గ్రామానికి శనివారం (ఆగస్టు 9,2020) లాక్‌డౌన్ విధించారు. కాగా కరోనా వచ్చినప్పుడు కూడా ఆ గ్రామంలో లాక్ డౌన్ లేదు. కానీ ఈ ప్లేగు వ్యాధి వచ్చి ఓ వ్యక్తి మరణించాక ఆ గ్రామంలో తొలిసారిగా లాక్‌డౌన్ విధించటం ఇదే కావడం విశేషం.

మరోవైపు ప్లేగు సోకి పలు అవయవాలు దెబ్బతిని మరో వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం (ఆగస్టు 8,2020) చనిపోయాడు. దీంతో ఉత్తర చైనా ప్రాంతంలో ఈ నెలలో ప్లేగు కేసులు రెండు నమోదయ్యాయి. ఆ రెండు కేసుల వ్యక్తులు మరణించారు.



ఈ విషయమై బవన్నాయెర్‌ హెల్త్ కమిషన్, ఆ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించామని వెల్లడించింది. దీనిపై ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ఈ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మరో గ్రామంలో ఓ వ్యక్తి అవయవాల వైఫల్యంతో చనిపోయాడు. దీంతో గురువారం మొదటి లాక్‌డౌన్ విధించారు. ఈ రెండు ప్రాంతాలకు ఈ ఏడాది చివరి వరకు ప్లేగు నిరోధిత అలర్ట్ జారీ చేశారు. ఈ అలర్ట్‌ల్లో మొత్తం 4 రకాలు ఉన్నాయి. చైనా మూడవ అలెర్ట్‌ని జారీ చేసింది. దీన్నిబట్టి పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.



ఈ లాక్‌డౌన్‌లో భాగంగా అక్కడి ప్రజలు జంతువుల్ని వేటాడటం, తినడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎవరిలోనైనా ప్లేగు లక్షణాలు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుందనీ..ఎలుకల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని హెచ్చరించారు.