ఐఫోన్ ఆర్డరిస్తే..యాపిల్ జ్యూస్ డెలివరీ..!!

orders iphone appleflavoured drink Delivery:  ప్రపంచం స్మార్ట్ ఫోన్ రూపంలో గుప్పిట్లోకొచ్చేసి ఏం కొనాలన్నా ఆన్ లైన్ లోనే. నట్టింట్లో కూర్చుని ‘నెట్టింటి’లోకి వెళ్లి..ఒక్క క్లిక్ చేస్తే చాలు మనం కావాలనుకున్న వస్తువు మన ఇంటి ముంగిటికే వచ్చేస్తోంది. దీంతో ఏం కొనాలన్నా షాపుకు వెళ్లాల్సిన పనిలేకుండా పోయింది. అలా ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా మరొకటి రావటంకూడా పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆర్డ్ ఇచ్చింది ఒకటైతే..డెలివరీ వచ్చింది మరోకటి వస్తున్నాయి. అవి చూసి మైండ్ బ్లాంక్ అయిపోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటిదే జరిగింది ఓ చైనాలో ఓ మహిళ విషయంలో..

చైనాలో ఓ మహిళ ఈ కామర్స్ సంస్థల్లో కాకుండా..డైరెక్ట్ గా యాపిల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను ఆర్డరిచ్చింది. ఆ ఫోన్ తనచేతికి ఎప్పుడొస్తుందా అని తెగ ఆతృతతో ఎదురుచూస్తోంది. డెలవరీ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆమె ఎంతో ఆశగా ఎదురు చూసినట్లుగానే ఓ రోజు ఆమెకు డెలివరీ అందింది.

దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. గబగబా ఆమె ఫోన్ ప్యాకేజీని విప్పి చూసింది. అంతే షాక్ కొట్టినట్లుగా ఉండిపోయింది. ఆ డెలివరీ ప్యాకెట్ లో ‘‘ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ కు బదులుగా యాపిల్ జ్యూస్’’ కనిపించింది. దీంతో షాకైన ఆమె వెంటనే యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేసింది.

అయితే..డెలివరీ బాయ్ తనకు నేరుగా పార్శిల్ ఇవ్వలేదని తనుంటున్న అపార్ట్‌మెంట్‌లోని తన లాకర్లో వదిలి వెళ్లాడని తెలిపింది. మహిళ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన యాపిల్ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. పార్శీల్ డెలవరీ చేసిన కొరియర్ సంస్థ కూడా ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఆమెకు ఆమె ఆశించిన ఫోన్ వస్తుందో రాదో..వస్తే ఎప్పుడొస్తుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది..