Chinese Defence Stocks: ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చైనా డిఫెన్స్ కంపెనీలపై పెను ప్రభావమే చూపాయి. చైనా డిఫెన్స్ స్టాక్స్ ఢమాల్ అయ్యాయి. ఆ దేశ డిఫెన్స్ స్టాక్స్ బుధవారం కూడా భారీగా నష్టపోయాయి. భారత వైమానిక దళానికి చెందిన అదమ్‌పూర్ వైమానిక స్థావరాన్ని చైనా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయనే పాకిస్తాన్ వాదనలను ప్రధాని మోదీ బహిరంగంగా తోసిపుచ్చారు. దాంతో చైనా రక్షణ నిల్వలు క్షీణించడం కొనసాగింది. పలు కంపెనీలు దాదాపు 4 శాతం మేర పడిపోయాయి. ఎయిరో స్పేస్, డిఫెన్స్ ఇండెక్స్ అయిన హాంగ్ సెంగ్ చైనా వరుసగా రెండో సెషన్‌లో నష్టాల బాటపట్టింది. దాదాపు 1.3 శాతం మేర క్షీణించింది. మంగళవారం 2.9% పతనమైన సంగతి తెలిసిందే.
చైనీస్ డిఫెన్స్ ఫర్మ్స్.. చైనా ఎయిరో స్పేస్ టైమ్స్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బ్రైట్ లేజర్ టెక్నాలజీస్, నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్, చైనా స్పేస్ సాట్, ఏవీఐసీ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన స్టాక్స్.. 1 శాతం నుంచి 4 శాతం మేర పడిపోయాయి. ఈ ఇండెక్స్ లోని మొత్తం 29 కంపెనీల స్టాక్స్‌లో కేవలం 2 మాత్రమే లాభాల్లో కొనసాగాయి. దీంతో ఈ సూచీ మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో 2.9 శాతం మేర పడిపోయింది. అలాగే ఎవిక్ చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ స్టాక్ 2 సెషన్లలోనే 9 శాతం మేర నష్టపోయింది.
చైనాకు చెందిన ఏవీఐసీ చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ తయారు చేస్తుంది. పాక్ ఎయిర్ ఫోర్స్ ఈ ఫైటర్ జెట్స్ ఉపయోగిస్తోంది. భారత్ దాడులను పాక్ నిలువరించలేకపోయిందని, చైనా నుంచి తీసుకొచ్చిన రక్షణ వ్యవస్థలు పని చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సైతం చైనా డిఫెన్స్ కంపెనీలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ప్రసంగం, చైనా రక్షణ ఉత్పత్తుల వినియోగంతో పాక్ విఫలమవడం వంటి కారణాలతో విదేశీ సంస్థాగత మదుపరులు చైనా రక్షణ కంపెనీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్టాక్స్ భారీగా పడిపోతున్నాయని విశ్లేషిస్తున్నారు.
ప్రధాని మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ముందు ఫోజులిచ్చారు. పాకిస్తాన్ మన S-400 , బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను JF-17 జెట్లతో నాశనం చేసిందని చెప్పడం పూర్తిగా అవాస్తవం అని ఆయన నిరూపించారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, మేడిన్ ఇండియా డిఫెన్స్ సిస్టమ్ వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని చెప్పడంతో భారత రక్షణ స్టాక్స్ దూసుకెళ్లాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్ 11% పెరిగి రూ. 1,749కి చేరుకుంది. పరాస్ డిఫెన్స్ 8.4% లాభపడింది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ 6.6%, భారత్ డైనమిక్స్ 4.4% పెరిగాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కూడా 2% కంటే ఎక్కువ పుంజుకోగా, జెన్ టెక్నాలజీస్ 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.