KitKat Chocolate Stolen : 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్ల భారీ ట్రక్కు చోరీ.. అసలేం జరిగిందంటే.. !
KitKat Chocolate Stolen : 12 టన్నుల చాక్లెట్ల ట్రక్కు ఒకటికి చోరీకి గురవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : March 29, 2026 / 03:48 PM IST
chocolate heist 12 tons of KitKat bars truck stolen in Europe
KitKat Chocolate Stolen : సాధారణంగా బంగారం, వెండి, డబ్బులు, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఆఖరికి ఇంట్లో వాడుకునే సామాను సైతం దొంగతనం చేసేవాళ్ల గురించి విన్నాం. ఈమధ్య కాలంలో అయితే గ్యాస్ బండ దొంగిలించుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సరే గ్యాస్ సరఫరా సరిగా లేదు కాబట్టి.. ఇలాంటి దొంగతనాలు జరగడం కామన్ అనుకుందాం. కానీ ఇప్పుడు మీరొక వింత దొంగతనం గురించి వినబోతున్నారు. అదే కిట్‌క్యాట్ చాక్లెట్ల దొంగతనం. చాక్లెట్లు దొంగతనం చేయడం కూడా పెద్ద నేరమా అనుకుంటున్నారా.. అవును నేరమే. ఇక్కడ దొంగతనం చేసింది ఒకటి, రెండు, లేదంటే వేల చాక్లెట్లు కాదు. 12 టన్నుల భారీ కిట్‌క్యాట్ చాక్లెట్ ట్రక్కునే దొంగతనం చేశారు. ఆ వివరాలు..
ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ కంపెనీ నెస్లేకి చెందిన పాపులర్ ‘కిట్‌క్యాట్’ (KitKat) చాక్లెట్ల భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో సుమారు 12 టన్నుల బరువున్న కిట్‌క్యాట్ చాక్లెట్ల లోడ్‌తో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు దొంగతనానికి గురయ్యింది. ఈ చోరీ వల్ల.. త్వరలో రానున్న ఈస్టర్ పండుగ వేళ మార్కెట్లో కిట్‌క్యాట్ చాక్లెట్లకు కొరత ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
ఈ దొంగతనం గురించి నెస్లే కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 4,13,793 యూనిట్ల కిట్‌క్యాట్ చాక్లెట్లతో లోడ్ చేసిన ఒక ట్రక్కు.. ప్రయాణంలో ఉండగానే మాయమయ్యింది. ఈ ట్రక్కులో ఉన్న మొత్తం చాక్లెట్ల బరువు దాదాపు 12 టన్నులు. ఈ ట్రక్కు ఉత్పత్తి సెంటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. ఈ భారీ ట్రక్ ఇటలీలోని సెంట్రల్ ప్రాంతం నుండి పోలాండ్ దిశగా వెళ్తోంది. మార్గమధ్యలో పలు యూరోపియన్ దేశాల్లో ఈ చాక్లెట్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ట్రక్కు ఎక్కడ మాయమైంది అనే విషయంపై స్పష్టత లేదు. అలానే ఇప్పటి వరకు మాయమైన ట్రక్కుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు అంటున్నారు.
ఈస్టర్ పండుగ వేళ ఈ చాక్లెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. అలాంటి పండుగకు ముందే చాక్లెట్ల ట్రక్కు మాయమవ్వడంతో.. మార్కెట్లో సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు, సప్లై చైన్ భాగస్వాములతో కలిసి విచారణ జరుపుతున్నారు.
అయితే చోరీకి గురైన ట్రక్కులో లోడ్ చేసిన ప్రతి కిట్‌క్యాట్ బార్‌పై ఒక ప్రత్యేకమైన ‘బ్యాచ్ కోడ్’ (Batch Code) ఉంటుందని.. దాని ద్వారా దొంగతనానికి గురైన ఈ ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.
