ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం కబళిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అనేది లేకుండా వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి..చికిత్స పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసితో ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది.
ఈ గడువు ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. కానీ లాక్ డౌన్ నిబంధనలు పొడిగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 15 లక్షలకు చేరుకుంది. మొత్తం 90 వేల మంది చనిపోయారు. కరోనా దెబ్బకు ఇటలీలో 17 వేల మందికిపైగానే చనిపోయారు.
ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు సైతం వ్యాధి బారిన పడ్డారు. సుమారు 100 మంది చనిపోయారని అంచనా. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్పెయిన్ లో 15 వేల మంది బలయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని అంచనా వేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ప్రపంచ ఆర్థిక రంగం అత్యంత దయనీయస్థితిని ఎదుర్కొంటోందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అమెరికాలో మార్చి నుంచి 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా
See Also | తెలంగాణలో కరోనా : మూడు కిలోమీటర్లు దాటారో..అంతే..బుక్ అవుతారు