ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన చైనాలో 10 మంది యువతులతో సహా 58 మంది భారత ఇంజినీర్లు చిక్కుకున్నారు. 58 మంది ఇంజినీర్లలో 51 మంది ఏపీ వాసులు ఉన్నారు. వీరిలో ఏడుగురు నార్త్ ఇండియాకు చెందిన వారు కాగా మిగతా 51 మంది ఇంజినీర్లలో తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం వాసులు ఉన్నారు. గత ఏడాది జులైలో టీసీఎల్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో ఎంపికైన ఇంజినీర్లు..ఆగస్టులో శిక్షణ కోసం చైనా వెళ్లారు.
ఫిబ్రవరిలో ఇంజినీర్ల శిక్షణ ముగియనుంది. అంతలోనే కరోనా వైరస్ రక్కసి కోరలు చాచడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఇంజినీర్లు బస చేసిన వుహాన్ లోనే కరోనా వైరస్ బయటపడింది. దీంతో ఇంజినీర్లు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. మరోవైపు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వారిని క్షేమంగా భారత్ కు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి.. విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఇంజినీర్ల అంశాన్ని ఆయన ప్రస్తావించే ఛాన్స్ ఉంది.
ఇటీవల చైనాకు వెళ్లి వచ్చినవారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రేణిగుంటలోని మొబైల్ కంపెనీల్లో పని చేస్తోన్న చైనా దేశస్థులపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. వుహాన్ లో తన కుమార్తె చిక్కుకోవడంతో విష్ణుప్రియ తండ్రి ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమ కూతురుని భారత్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే రోజాకు వినతి పత్రం ఇస్తామన్నారు.
తెలుగు వారు చైనాలో చిక్కుకుపోయిన విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. వుహాన్ నుంచి విమానాల రాకపోకలను అనుమతించిన వెంటనే టీసీఎల్ ఉద్యోగులను భారత్ కు తీసుకొస్తామన్నారు.