Nepal Flash Floods Death Count : నేపాల్‌ మెరుపు వరదల్లో 900 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Nepal Flash Floods Death Count : నేపాల్ విపత్తు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. సోమవారం ఉదయం వరకు మృతుల సంఖ్య 903కు చేరింది.

Nepal Flash Floods Death Count

Nepal Flash Floods Death Count : ఆకస్మిక వరదలు నేపాల్ ను అతలాకుతలం చేశాయి. వరద బీభత్సానికి ఇండ్లు, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోగా.. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు బురద, మట్టిరాళ్లు పేరుకుపోయాయి. వరద బీభత్సం కారణంగా వందల సంఖ్యలో మృతి చెందగా.. వేలాది మంది ఆచూకీ ఇంకా లభించలేదు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, నేపాల్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం వరద విపత్తు కారణంగా మృతుల సంఖ్య 900 దాటింది.

Also Read : Nepal Flood : నేపాల్‌లో మృత్యువును జయించిన ఆరేళ్ల చిన్నారి.. మూడ్రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటకు! వీడియో వైరల్..

తాజా అధికారిక లెక్కల ప్రకారం నేపాల్‌లో వరదల కారణంగా 903 మంది మృతి చెందగా.. మరో 4,247 మంది గల్లంతయ్యారు. చైనా సరిహద్దు ప్రాంతంలోనూ 16 మంది మృతి చెందగా, 546 మంది ఆచూకీ తెలియడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. వరద బాధితులకు భారతదేశం సహా పలు దేశాలు సహాయాన్ని అందజేస్తున్నాయి. మలేషియా ప్రభుత్వం సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని పంపనున్నట్లు ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. అలాగే నేపాల్‌కు 10 లక్షల డాలర్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. హిమాలయ ప్రాంతంలో ఓ హిమానీనదం సమీపంలోని కొండచరియలు భారీగా కూలిపోవడంతో ఈ విపత్తు ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భారీగా కూలిన రాళ్లు, కరిగిన మంచు నీరు దిగువ ప్రాంతాల్లోని నదుల్లోకి చేరడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాల్లో భవనాలు, వంతెనలు, మట్టి కొట్టుకుపోయాయి.

నేపాల్ విపత్తు వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరదలపై చైనా ముందస్తు సమాచారం ఇవ్వకపోవటం వల్లనే ఇంతటి విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చిందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, చైనా మాత్రం ఆ వాదనను కొట్టిపారేసింది. ఇలాంటి విపత్తు వచ్చే ప్రమాదం ఉందని పదిరోజులకు ముందే నేపాల్ ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది.