తాబేలు తడాఖా : అంతరించిపోతున్నతన జాతిని కాపాడేండుకు ఏం చేసిందంటే..

  • Publish Date - January 13, 2020 / 04:42 AM IST

అంతరించిపోతున్న తన జాతిని కాపాడేండుకు ఓ తాబేలు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. సాక్షాత్తు సైంటిస్టులను ఈ తాబేలు ఆశ్చర్యపోయేలా చేసింది. తన తడాఖా ఏంటో చూపెట్టింది. తన జీవితం అంతా తన జాతిని కాపాడుకోవటానికే కృషి చేసింది. ఒకరకంగా చెప్పాలంటే తన జీవితాన్ని ధారపోసిందని చెప్పుకోవచ్చు. అలా గత 60 సంవత్సరాల పాటు కష్టపడింది. ఈ 60 సంవత్సరాల తరువాత తిరిగిన తన స్వస్థలానికి చేరుకోవటాని రెడీ అవుతోంది.  మరి  గాడ్ ఫాదర్ తాబేలు గురించి తెలుసుకోవాల్సిందే.

వివరాల్లోకి వెళితే..ఈక్వెడార్‌లోని గాలపాగోస్‌ దీవుల్లోని ఎస్పానోలా ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం ఓ తాబేలు పుట్టింది. దాని పేరు ‘డిగో’. గతంలో ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 50 ఏండ్ల కిందట ఈ భారీ తాబేళ్లు 14 మాత్రమే ఉండేవి. అందులో రెండు మగవి కాగా, 12 ఆడ తాబేళ్లు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతులను రక్షించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు 1960లో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 

దీంట్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మగ తాబేళ్లను సెలక్ట్ చేసిన కాలిఫోర్నియాలోని శాంటాక్లాజ్‌ దీవుల్లో ఉన్న శాండియాగో జూకు తరలించారు. ఇందులో డిగో తాబేలు కూడా ఉంది.  సైంటిస్టులు చేపట్టిన ఈ ప్రాజెక్టులో గత 50 సంవత్సరాలలో రెండు వేల భారీ తాబేళ్లు జన్మించాయి. వాటిలో 800 తాబేళ్లకు ‘డిగోనే తండ్రి’ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూర్తయింది. 
తన జాతిని రక్షించే బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన డిగో ఇప్పుడు పుట్టింటికి అంటే ఈక్వెడార్‌లోని గాలపాగోస్‌ దీవుల్లోని ఎస్పానోలా ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాలిఫోర్నియాలోని శాంటాక్లాజ్‌ దీవుల్లో ఉన్న శాండియాగో జూ నుంచి తిరిగి డిగోను శాస్త్రవేత్తలు 2020 మార్చిలో దాని స్వస్థమైన గాలపాగోస్‌ దీవుల్లోని ఎస్పానోలాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పానోలాలో ప్రస్తుతం 1800 తాబేళ్లు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 40 శాతం తాబేళ్లకు డిగోనే మూలపురుషుడు కావడం విశేషం.

100 సంవత్సరాల తాబేలు ‘డిగో’ స్పెషల్ 
100 సంవత్సరాల తాబేలు ‘డిగో’ 80 కిలోల బరువు ఉంది. డిగో మెడను సాగదీసినప్పుడు 90 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. శరీరం 1.5 మీటర్ల పొడవు కలిగి ఉంది. కాగా తాబేళ్లు 400ల సంవత్సరాలు కూడా జీవిస్తాయి. వీటి జీవిత కాలంలో వందలాది తాబేళ్లకు సంతానానికి జన్మనిచ్చే శక్తిని కలిగి ఉంటాయి.  

ఈక్వెడార్‌కు పశ్చిమాన 906 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గాలపాగోస్‌ ద్వీపాలు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వీటిలో సీల్స్, ఇగువానా, తాబేళ్లతో పాటు పలు రకాల పక్షులు..వివిధ జాతులకు చెందిన  మొక్కలు..వన్యప్రాణుల ప్రత్యేక ప్రాంతంగా విరాజిల్లుతోంది.