Rice Export Ban: అమెరికాలో మనోళ్ల బియ్యం కష్టాలు.. వైరల్ అవుతున్న వీడియోలు

బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించడం అమెరికాలోని భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వారి ఆందోళనకు అద్దం పడుతూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు.

America

Rice Export Ban – America : బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ (India) నిషేధించడం అమెరికాలోని ప్రవాస భారతీయుల (NRIs)పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిషేధం ఎంతవరకూ కొనసాగుతుందో తెలియని నేపథ్యంలో అమెరికాలోని భారతీయులు (American Indians) భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలుగువారితో పాటు దక్షిణ భారతీయులు.. బియ్యం బ్యాగుల (Rice Bags) కొనుగోలుకు స్టోర్స్ ముందు భారీ క్యూలు కట్టారు. ఈ నిషేధాన్ని స్టోర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఒక ఫ్యామిలీకి ఒక బ్యాగ్ మాత్రమే అని బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు. 20 పౌండ్లు ఉన్న రైస్ బ్యాగ్ ధరను 18 డాలర్ల నుంచి 50 డాలర్లకు పెంచేసారు.

ఇక సోషల్ మీడియా (Social Media) లో ఎక్కడ చూసినా ఇవే పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ప్రవాసులు దీనిపై విస్తృత చర్చలు చేపట్టారు. ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్స్ ముందు క్యూ కట్టిన వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. అమెరికాలో బియ్యం కొనడానికి ఎంతో కష్టపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ బాధలను ఒకరితో వాట్సప్ లో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. బియ్యం కొనడానికి ఆఫీసులకు సెలవు పెట్టాల్సి వస్తోందని కూడా అంటున్నారు. బియ్యం బస్తాల కోసం చాలా దుకాణాలు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

NRIs : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు.. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

రుతుపవనాలు (Monsoon) ఆలస్యం కావడం, పంటలు దెబ్బతినడంతో భారత్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గుతుందనే భయం మొదలైంది. దేశీయ ధరల్ని తగ్గించడానికి, ఆహార ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ఇప్పటికే ఇండియా 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్, ఇరాన్, ఇరాక్ మరియు సౌదీ అరేబియా ప్రధానంగా ఇండియా నుంచి ప్రీమియం బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. భారత్ తీసుకున్న నిర్ణయం US మార్కెట్‌ను చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంక్షలు ఎక్కువ కాలం కొనసాగితే సోనా మసూరి రైస్ కంటే తక్కువ ప్రజాదరణ ఉన్న మెక్సికన్ బ్రాండ్ బియ్యాన్ని తెలుగు ప్రజలు కొంతకాలం కొనాల్సి రావచ్చు.

US Recession starting soon : అమెరికాలో త్వరలో ఆర్థిక మాంద్యం.. బలహీనపడుతున్న వ్యాపార సంస్థల సూచీలు

భారత్ నిషేధం ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నారైలు సూపర్ మార్కెట్ల ముందు క్యూ కట్టారు. ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు సూపర్ మార్కెట్లు ధరలు పెంచడం ఇక్కడి తెలుగువారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరికి ఒక రైస్ బ్యాగ్ అనే ఆంక్షలు, నో స్టాక్ బోర్డులు ఈ ఆందోళనను మరింతగా పెంచేశాయి. సోషల్ మీడియా మొత్తం ఇదే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిషేధం ఎప్పటివరకూ కొనసాగుతుందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన సమయంలో ధాన్యం మార్కెట్‌లో కనిపించిన దాని కంటే భారత్ సరఫరాను తగ్గించడం మార్కెట్‌కు బిగ్ షాక్ ఇచ్చిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.