Donald Trump: టారిఫ్ బాంబ్.. మళ్లీ సుంకాలు విధించేందుకు సిద్ధమైన ట్రంప్..! సరికొత్త అస్త్రం సెక్షన్ 301 ప్రయోగం..!
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాల్ చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301.
- Naveen
- Published On : March 12, 2026 / 05:24 PM IST
Donald Trump Representative Image (Image Credit To Original Source)
- భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాఫ్తు కోసం సెక్షన్ 301
- దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించేందుకు అమెరికాకు అధికారం
- ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఏకపక్షంగా చర్యలు తీసుకోవచ్చు
Donald Trump: ఇతర దేశాల నుంచి ఎలాగైనా టారిఫ్ లు వసూలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. సెక్షన్ 301 ఆయుధాన్ని బయటకు తీశారు ట్రంప్. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాఫ్తు ప్రారంభించేందుకు సెక్షన్ 301 ని ప్రయోగించనుంది అమెరికా. దీనిపై అమెరికా వాణిజ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా విధించిన టారిఫ్ లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చింది.
దీంతో మరో దారిలో అమెరికా 1974 వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్ ను బయటకు తీశారు. ఈ సెక్షన్ కింద భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్ లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై ఈ దర్యాఫ్తు జరగనుంది.
ఏంటీ సెక్షన్ 301?
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాల్ చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న ట్రేడ్ పాలసీలు అమెరికా వ్యాపారాల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా అనే దానిపై ఈ చట్టం కింద అమెరికా దర్యాఫ్తు చేసేందుకు వీలుంటుంది. భాగస్వామ్య దేశాలు అమెరికాకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీను అనుసరిస్తోందని తేలితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతి లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం కింద అధికారం ఉంటుంది.
అలాంటి దేశాలపై చట్టబద్ధంగా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార చర్యలు తీసుకునేందుకు అమెరికాకు అధికారం, మార్గం ఉంటుంది. చైనా లాంటి ప్రత్యర్థులతో పాటు భారత్ పైన అమెరికా ఈ దర్యాఫ్తు చేపడుతోంది. భారత్ లోని కొన్ని వాణిజ్య విధానాల వల్ల మన మార్కెట్లపై అమెరికాకు పరిమితులు ఉంటున్నాయని చాలాకాలంగా అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కొన్ని ఉత్పత్తులపై భారత్ అమలు చేస్తున్న అధిక సుంకాలు, స్థానిక తయారీ, డేటా స్టోరేజ్, టెక్నాలజీ నిబంధనలు వంటి వాటిపై అమెరికా అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ అంశాలపైనే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పుడీ దర్యాఫ్తుతో భారత్ పై వెంటనే పెనాల్టీలు పడే అవకాశం లేనప్పటికీ భవిష్యత్తులో కొన్ని రంగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. దీంతో ఆయా రంగాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఇంట్లో గ్యాస్ టెన్షన్ వద్దు.. సిలిండర్ అయిపోతుందని ముందే ఎలా తెలుసుకోవాలి? సింపుల్ హోం ట్రిక్..!
