Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని ట్రంప్ సర్కార్ తాజాగా రద్దు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ఈ మేరకు లేఖ రాశారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్తించనుందని తెలిపారు. తాజా నిర్ణయం ఈ విద్యాలయంలో ప్రవేశాలు పొందిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది. ఇది చట్ట వ్యతిరేకమని, యూనివర్శిటీకి తీవ్ర హాని చేస్తుందని పేర్కొంది. దీనిపై తాము తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు పేర్కొంది. అయితే, ట్రంప్ సర్కార్ నిర్ణయంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థులంతా వేరే యూనివర్శిటీకి బదిలీ కావాల్సి ఉంటుంది. లేదంటే.. అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ఈ హోదాను పునరుద్దరించుకునేందుకు హార్వర్డ్ యూనివర్శిటీకి ట్రంప్ సర్కార్ ఓ అవకాశం ఇచ్చింది. అదేమిటంటే.. మూడు రోజుల్లో తమ ఆరు డిమాండ్లను అంగీకరించాలని ఆ లేఖలో పేర్కొంది.
ఆరు కండీషన్లు ఇవే..
♦ గత ఐదేళ్లలో యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట జరిపిన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులన్నీ సమర్పించాలి. ఆడియో, వీడియో పుటేజీలతో సహా అందజేయాలి.
♦ గత ఐదేళ్లలో వలసదారు కాని (నాన్ ఇమిగ్రెంట్) విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర, హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఆడియోలు, వీడియో పుటేజ్ లతో అందజేయాలి.
♦ నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు.. ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డులను సమర్పించాలి.
♦ గత ఐదేళ్లలో వలసేతర విద్యార్థులు క్యాంపస్‌లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆ వివరాలు అందించాలి.
♦ గత ఐదేళ్లలో హార్వర్డ్‌లో నమోదుచేసుకున్న వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను ఇవ్వాలి.
♦ క్యాంపస్‌లో వలసేతర విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటే ఆ ఆడియో, వీడియో ఫుటేజ్‌లను ప్రభుత్వానికి సమర్పించాలని క్రిస్టి నోయెమ్ ఆదేశించారు.
అమెరికాలో పురాతన, సంపన్న విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. ఈ యూనివర్శిటీలో ప్రతీయేడాది 140 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్ రద్దు చేయడం వల్ల.. హార్వర్డ్ యూనివర్శిటీ ఇకపై F-1 లేదా J-1 వీసాలపై విదేశీ విద్యార్థులను చేర్చుకోలేదు. ఈ కారణంగా 6,800 మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అంటే హార్వర్డ్ యూనివర్శిటీలో నాలుగో వంతు మంది. వారిలో, దాదాపు 800 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.