×
Ad

ట్రంప్​తో మమ్దానీ భేటీ.. అవన్నీ మర్చిపోయాం.. ఇప్పుడు మా లక్ష్యం ఒక్కటేనన్న ట్రంప్.. ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర సన్నివేశం.. వీడియో వైరల్

Trump Zohran Mamadani first meeting : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జోహ్రాన్ మమ్దానీలు నిన్నమొన్నటి వరకు బద్ద శత్రువులుగా మాటల తూటాలు..

Donald Trump Zohran Mamadani

Trump Zohran Mamadani first meeting : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జోహ్రాన్ మమ్దానీలు నిన్నమొన్నటి వరకు బద్ద శత్రువులుగా మాటల తూటాలు పేల్చుకున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయం నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ట్రంప్ మమ్దానీని రాడికల్ లెఫ్ట్ లూనాటిక్ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.. మమ్దానీ సైతం ట్రంప్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. ట్రంప్ ను ఉద్దేశిస్తూ నియంత అంటూ తిట్లు తిట్టాడు. ఆయితే, ఆ ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ గా మమ్దానీనే విజయం సాధించాడు. ఇన్నవీ ఒకెత్తు అయితే.. తాజాగా.. ట్రంప్, మమ్దానీ భేటీ అయ్యారు. నిన్నమొన్నటి వరకు బద్దశత్రువులుగా విమర్శల దాడిచేసుకున్న వీరు.. ప్రస్తుతం భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీలు భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరి భేటీ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ట్రంప్ కుర్చీపై కూర్చొని ఉండగా.. మమ్దానీ ట్రంప్ పక్కనే నిలబడి సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు వారిద్దరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

ట్రంప్ మాట్లాడుతూ.. న్యూయార్క్ మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన నగరం. ఆ నగరం, ప్రజలు బాగుండాలనేది మా కామన్ లక్ష్యం. మేయర్ గా గెలిచినందుకు మమ్దానీకి అభినందనలు తెలిపాను. ఆయన మంచి మేయర్ గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం ఒక రాజకీయ వర్గానికే కాకుండా కన్సర్వేటివ్, లిబరల్ అని తేడా లేకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తాడని అనుకుంటున్నా అంటూ ట్రంప్ అన్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉన్నాయి. హౌసింగ్, ఆహార ధరలు వంటి కీలక సమస్యలపై ఇద్దరం ఒకే అభిప్రాయానికి వచ్చాం. నగరంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆహార ధరలు, ముఖ్యంగా నూనె ధరలు భారీగా తగ్గుతున్నాయని ట్రంప్ అన్నారు. అంతేకాదు.. రాజకీయ రేఖలు పక్కనబెట్టి నగరాన్ని అభివృద్ధి చేసేందుకోసం పరస్పర సహకారం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.

మమ్దానీ మాట్లాడుతూ.. ట్రంప్ తో భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని అన్నాడు. ప్రెసిడెంట్ తో జరిగిన ఈ చర్చ ఎంతో ఉపయోగకరంగా సాగింది. మేమిద్దరం ప్రేమించే నగరం న్యూయార్క్. ఇక్కడ రోజురోజుకు పెరుగుతున్న జీవన వ్యయం ప్రజలను నగరాన్ని వదిలిపెట్టి వెళ్లేలా చేస్తోంది. రెంట్లు, కూరగాయల ధరలు, యుటిలిటీల బిల్లులు ఇవన్నీ సాధారణ కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలను ఎలా తగ్గించాలనే అంశాలపై ట్రంప్ తో చర్చించడం జరిగిందని తెలిపారు. నాకు సమయం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ కు ధన్యవాదాలని మమ్దానీ పేర్కొన్నారు.

మీడియా ప్రశ్నలు.. ట్రంప్ జోక్స్..
న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయంలో మమ్దానీ ట్రంప్‌ను నియంత అంటూ అభివర్ణించిన విషయం తెలిసిందే. తాజా.. ఓ విలేకరి ఇదే అంశంపై మమ్దానీని ప్రశ్నించాడు. ట్రంప్ ను నియంత అన్నవ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా..? అంటూ ప్రశ్నించగా.. మమ్దానీ స్పందించే క్రమంలోనే ట్రంప్ నవ్వుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అవును అను.. ఓ పనైపోతుంది.. నేనేమనుకోను’ అంటూ మమ్దానీ భుజంపై కొడుతూ ట్రంప్ జోక్ చేశాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.