Donald Trump : ట్రంప్ జబర్దస్త్ కామెడీ.. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండమందట.. కోతల రాయుడు..
Donald Trump : ఇరాన్ సైన్యంలో సింహభాగంను మేము నాశనం చేశాం. ఈ యుద్ధంలో మేం భారీ విజయాన్ని సాధించబోతున్నాం. ఇంతవరకూ పశ్చిమాసియాలో ఎవరూ చూడని విక్టరీ అది అంటూ ట్రంప్ అన్నారు.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 02:21 PM IST
Donald Trump
- ఇరాన్ నాయకత్వం సుప్రీం లీడర్‌గా తనను ప్రతిపాదించింది
- కానీ, నేను వారి ప్రతిపాదనను తిరస్కరించా
- ఉద్రిక్తతల వేళ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడులు తీవ్రమవుతున్నాయి. మరోవైపు చర్చలు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్ లో జరిగిన రిపబ్లికన్ ఫండ్‌రైజర్ సమావేశంలో ట్రంప్ పాల్గొని మాట్లాడారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్‌కి సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించిందని, కానీ, తాను తిరస్కరించానని, ఆ పదవి ఎవరూ కోరుకోరు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చకు దారితీశాయి.
ఇరాన్ సైన్యంలో సింహభాగంను మేము నాశనం చేశాం. ఈ యుద్ధంలో మేం భారీ విజయాన్ని సాధించబోతున్నాం. ఇంతవరకూ పశ్చిమాసియాలో ఎవరూ చూడని విక్టరీ అది. ఇక, యుద్ధం ముగింపు విషయంలో మేము చర్చలు జరుపుతున్నాం. ఆ ఒప్పందం కోసం ఇరాన్ ప్రాదేయపడింది. కానీ, ఆ విషయాన్ని వారు బయటకు చెప్పడం లేదు. ఎందుకంటే అలా చెబితే సొంత ప్రజల చేతుల్లోనే హత్యకు గురవుతారని వారు భయపడుతున్నారంటూ ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఒకవైపు ట్రంప్.. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ఎలాంటి చర్చలు లేవు అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ తో చర్చలకు ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యుద్ధాన్ని నిలిపివేసేందుకు 15 పాయింట్ల ప్రణాళికను ఆ దేశం ముందు ఉంచాడు. ఇందులో అన్వాస్త్ర తయారీ ప్రణాళికతను టెహ్రాన్ ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచడం వంటి కీలకాంశాలు అందులో ఉన్నాయి. అయితే, అమెరికా డిమాండ్లు తమకు అంగీకారయోగ్యం కాదని ఇరాన్ తేల్చేసింది.
