×
Ad

Donald Trump : ట్రంప్ కొత్త రాగం.. హెచ్‌-1బీ వీసాలపై సంచలన ప్రకటన.. వారికి శుభవార్త

Donald Trump అమెరికన్ కార్మికుల వేతనాలు పెంచడానికి తాను మద్దతిస్తున్నానని.. అయితే, దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అసలు విషయం బోధపడిందా.. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం ఎంత అవసరమో తెలిసొచ్చిందా..? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలనుబట్టి ట్రంప్ ఆలోచనా విధానం మారినట్లుగా అర్ధమవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీ ఉద్యోగులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో అమెరికాలోనూ వ్యరేతిక పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడి వైఖరిలో కొంత మార్పును సూచిస్తున్నాయి.

ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనని అన్నారు. అదే సమయంలో.. అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని ట్రంప్ అంగీకరించారు. అంతేకాదు.. అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమని ట్రంప్ కుండబద్దలు కొట్టేశారు. తద్వారా విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు అమెరికాకు ఎంత ముఖ్యమో ట్రంప్ చెప్పకనే చెప్పారు.

అమెరికన్ కార్మికుల వేతనాలు పెంచడానికి తాను మద్దతిస్తున్నానని.. అయితే, దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సిన ఉంటుందని ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారు చేయడంలో చాలా ప్రతిభ కలిగి ఉంటారన్న ట్రంప్.. అటువంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యం అవసరమని, శిక్షణ లేని, దీర్ఘకాలిక నిరుద్యోగ కార్మికులతో ఆ స్థానాలను భర్తీ చేయలేమని అన్నారు.

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. టారిప్‌లతోపాటు హెచ్-1బీ వీసాలపై కూడా తన మార్క్ చూపించారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరడాలనుకునే ఉద్యోగస్తుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను కూడా తెరపైకి తెచ్చారు. అయితే, ఇప్పుడు ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇది భారతీయులతో సహా ఆ దేశంలోని మొత్తం ప్రవాసుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.