Donald trump
USA Mayor Elections : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్ తగిలింది. అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ దక్కించుకున్నాడు. అదే సమయంలో వర్జీనియాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైల్ కావడం విశేషం.
న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ దక్కించుకున్నాడు. మమ్దానీకి 49.06శాతం ఓట్లు (6,77,615) పోలయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. ఆయన భారతీయ, ఉగాండా మూలాలు కలిగిన వ్యక్తి. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. తన ఏడేళ్ల వయస్సు నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకుపైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. అంతేకాదు.. అతిపిన్న వయస్సు (34ఏళ్లు)లో న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా మమ్దానీ రికార్డు సృష్టించాడు.
ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారడంతో.. మమ్దానీ ఓటమికోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా ‘‘కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దానీ న్యూయార్క్ మేయర్ గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తాను’’ అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
వర్జీనియా గవర్నర్‌గా అబిగైల్ స్పాన్‌బెర్గర్..
అమెరికాలోని వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే సియర్స్‌ను ఓడించారు. అబిగైల్ స్పాన్‌బెర్గర్‌కు 14.80లక్షల ఓట్లు పోలవ్వగా.. సీయర్స్ కు 11.61లక్షల ఓట్లు పోలయ్యాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం. స్పాన్‌బెర్గర్ తన ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమోక్రటికన్లను ఏకం చేయడంలో సహాయపడింది.
నూతన ఎల్‌జీ హైదరాబాదీ మూలాలున్న గజాలా హష్మీ.
భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా గుర్తింపు పొందారు.