Global Food Crisis: తీవ్ర ఆహార సంక్షోభం రాబోతోంది.. రెండు యుద్ధాలు, పెను ప్రమాదం.. ఈఏఏమ్ జైశంకర్ సంచలన హెచ్చరిక!
ప్రపంచం తీవ్రమైన ఆహార(Global Food Crisis) సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు.
- V Santhosh Kumar
- Updated on- September 30, 2026 / 11:57 AM IST
EAM Jaishankar sensational comments on world food crisis and fertilizer shortage.
Global Food Crisis: ఉక్రెయిన్, పశ్చిమాసియాలలో కొనసాగుతున్న తీవ్రమైన యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు. న్యూయార్క్‌లోని ‘ఏషియా సొసైటీ’ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ రెండు యుద్ధాల వల్ల ఎరువుల సరఫరా దెబ్బతిని, గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోందని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరాకు తీవ్ర విఘాతం:
బ్లాక్ సీ మార్గంలో నౌకాయానం నిలిచిపోవడంతో ప్రధాన ధాన్యాల ఎగుమతులు నిలిచిపోయాయని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, పశ్చిమాసియాల నుంచి రావాల్సిన ఎరువుల ఉత్పాదన పూర్తిగా దెబ్బతిన్నదని, దీనికి తీవ్ర వాతావరణ మార్పులు కూడా తోడవడంతో వ్యవసాయ (Global Food Crisis)రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇంధన భద్రతపై రాజకీయాలు చేయడం వల్ల చమురు ధరలు మరింత పెరిగి మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
స్వార్థపూరిత నిర్ణయాలపై అభివృద్ధి చెందుతున్న దేశాల ఆగ్రహం:
పెద్ద దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోతున్నాయని జైశంకర్ విమర్శించారు. ఇంధనం, ఆహారం, ఎరువుల కొరతతో పాటు, యుద్దాల వల్ల పెట్టుబడులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి గ్లోబల్ సౌత్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్దం తర్వాత దక్షిణాసియా పొరుగు దేశాల్లో ఎలాంటి రాజకీయ, ఆర్థిక అస్థిరతలు వచ్చాయో చూశామని, గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిణామాలు ఆ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు.
స్వయంప్రతిపత్తితోనే సవాళ్లకు చెక్.. జైశంకర్ స్పష్టత:
ఇలాంటి క్లిష్ట సమయాల్లో తమ విదేశాంగ విధానంలో స్వయంప్రతిపత్తి కలిగి ఉండే దేశాలు మాత్రమే ఈ సంక్షోభాలను తట్టుకుని నిలబడగలుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఈ ఒత్తిళ్లకు లొంగిపోవాల్సి వస్తుండగా, మరికొన్ని సర్దుబాట్లు చేసుకుంటున్నాయని, స్వీయ నిర్ణయాధికారాలు ఉన్న దేశాలు మాత్రం ధైర్యంగా పోరాడుతున్నాయని వివరించారు. పెద్ద దేశాలు కేవలం తమ ప్రయోజనాలే కాకుండా సమన్వయంతో వ్యవహరించి పేద దేశాల ప్రాథమిక అవసరాలు దెబ్బతినకుండా చూడాలని పిలుపునిచ్చారు.
