Ebola Outbreak: ఎబోలా టెన్షన్.. ఆ దేశాలకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం అలర్ట్..
ఇప్పటికే కాంగోలో మొత్తం 867 మంది ఈ వైరస్ బారిన పడగా.. 204 మరణాలు నమోదయ్యాయి. కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు పాకిన ఎబోలా..
- Naveen
- Updated on- May 24, 2026 / 05:16 PM IST
Ebola Outbreak: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ గుబులు పుట్టిస్తోంది. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై అలర్ట్ అయ్యింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించొద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది.
ఇప్పటికే కాంగోలో మొత్తం 867 మంది ఈ వైరస్ బారిన పడగా.. 204 మరణాలు నమోదయ్యాయి. కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు పాకిన ఎబోలా.. వందల మందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలని తెలిపింది. ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించుకోవాలని సూచించింది. ఈ మూడు వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించి తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఇక కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లోనే మరణించారు.
Also Read: డేంజర్ బెల్స్.. 10 ఆఫ్రికా దేశాలకు పొంచి ఉన్న ఎబోలా ముప్పు..
