Ebola Risk: డేంజర్ బెల్స్.. 10 ఆఫ్రికా దేశాలకు పొంచి ఉన్న ఎబోలా ముప్పు..
ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న వారు వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది.
Ebola Risk: ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎబోలా భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు (ఆఫ్రికా CDC) చేసిన హెచ్చరిక మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరో 10 ఆఫ్రికా దేశాలకు ఎబోలా ముప్పు పొంచి ఉందని ఆఫ్రికా సీడీసీ తెలిపింది.
ఇప్పటికే ఈ వ్యాధిపై ఆందోళనలు ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాతో పాటు మరో 10 ఆఫ్రికా దేశాలు ఎబోలా వైరస్ బారిన పడే ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించింది. అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, కెన్యా, రువాండా, దక్షిణ సూడాన్, టాంజానియా, జాంబియా ప్రమాదంలో ఉన్న దేశాలుగా గుర్తించారు ఆఫ్రికా CDC డైరెక్టర్-జనరల్ జీన్ కసేయా. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని నివారించడానికి ఆరోగ్య అధికారులు పొరుగు దేశాలను పర్యవేక్షిస్తూ, నివారణ చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ప్రాణాంతక వైరస్ ప్రాంతీయంగా మరింత విస్తరిస్తుందనే భయాలు పెరుగుతున్నాయి.
ఎబోలాలో అత్యంత అరుదైన బుండిబుగియో స్ట్రెయిన్ కారణంగానే ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఈ రకం కేసులు ఎక్కువగా కాంగోలో నమోదవుతున్నాయి. ఉగాండాలో ఈ రకం వైరస్ ను 2007లో తొలిసారిగా గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, కండరాల నొప్పి, తల నొప్పి లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు, విరేచనాలతో శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. దీన్నే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని కూడా అంటున్నారు.
ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్న వారు వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది. దీంతో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: ఈ దేశంలో జస్ట్ రూ.22 వేలకే ఇళ్ల స్థలాలు.. మీరు చేయాల్సింది ఒకటే.. అది కూడా సింపుల్
