Church Father Dies : మరణం గురించి చర్చిలో సందేశం ఇస్తున్న ఫాదర్.. గోడకున్న శిలువ తలపై పడి మృతి.. వీడియో వైరల్ ..
Church Father Dies : ఈక్వెడార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిలువ మీదపడి చర్చి ఫాదర్ అక్కడికక్కడే మరణించాడు.
- Harish Thanniru
- Published on- October 19, 2026 / 09:31 AM IST
Church Father Dies
Church Father Dies : ఈక్వెడార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసులకు సందేశం ఇచ్చిన కొద్దిసేపటికే ఓ కాథలిక్ చర్చి ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెనుక గోడకు పైభాగంలో అమర్చిన భారీ ఏసుక్రీస్తు శిలువ ఒక్కసారిగా ఊడి చర్చి ఫాదర్ తలపై బలంగా పడింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, చర్చిలో ఉన్న భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read : Hindu Temple In Pakistan : పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం..
ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చిలో అక్టోబర్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఆయన వెనుక గోడకు అమర్చిన భారీ శిలువ ఒక్కసారిగా ఊడిపడి తల వెనుక భాగంలో బలంగా తాకింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న వారికి ఫాదర్ సందేశం ఇస్తున్నారు. జీవితంలోని అనిశ్చితి, మరణం గురించి విశ్వాసులతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా దేవుడికి, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు సమయం కేటాయించాలని సూచించారు. మనిషి జీవితం శాశ్వతం కాదని, ఇతర విషయాల కంటే దేవుడితో గడిపే సమయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సందేశమిచ్చారు. సందేశం ఇస్తున్న సమయంలో ప్రమాదం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.
శిలువ పూజారిపై పడిన వెంటనే చర్చిలో ఉన్న భక్తులు భయంతో కేకలు వేస్తూ ఆయన వద్దకు పరుగెత్తారు. అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే చర్చి ఫాదర్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్వాయాకిల్ ఆర్చ్డియోసిస్ ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. శిలువ గోడ నుంచి ఎందుకు ఊడిపోయిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.
