Trains Collide : ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..
Trains Collide : రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 88 మంది గాయపడ్డారు.
- Harish Thanniru
- Published on- November 8, 2026 / 10:03 PM IST
Trains Collide
Trains Collide : ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 88 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పలు రైలు బోగీలు పట్టాలు తప్పడంతో తీవ్ర కలకలం రేగింది.
Also Read : CM Revanth Reddy : సైన్స్ మ్యూజియంలో విద్యార్థుల ప్రయోగాలు.. ఆసక్తిగా పరిశీలించిన సీఎం రేవంత్.. వీడియో వైరల్
ఆదివారం ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో అల్-అయ్యత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కైరో నగరానికి దక్షిణంగా సుమారు 76 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గిజా నుంచి ఫయ్యూమ్ ప్రాంతానికి వెళ్తున్న రైలు.. కైరో నుంచి అస్వాన్‌కు వెళ్తున్న మరో రైలు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు రైలు ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి రైల్వే మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లను రంగంలోకి దించి పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. ప్రమాదంకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
