Egyptian spa offers snake massage : జర..జర మని నేలమీద పాములు పాకుతుంటేనే మనకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఒళ్ళంతా జలదరింపు వచ్చేస్తుంది. అటువంటిది ఏకంగా మన శరీరంపై పాములు బుస్..బుస్ మంటూ శబ్దాలు చేస్తూ.. జర..జరా మని పాకితే ఎలా ఉంటుంది?!! ఏంటీ పై ప్రాణాలు పైనే పోతాయి కదూ..మరి ఈ మాత్రం మాటకే భయపడి ఛస్తుంటే ఇక ‘‘పాములతో బాడీ మసాజ్’’ చేయించుకుంటే ఎలా ఉంటుంది?!!..వామ్మో పాములతో మసాజా..మతిగానీ పోయిందా ఏంటీ అనిపిస్తుంది కదూ..అసలు ఆ మాటకే ఒళ్లంతా చల్లబడిపోతుంది. కానీ నిజంగా పాములతో మసాజ్ సెంటర్లున్నాయి.
ఆ పాములు మసాజ్ సెంటర్ లో పాములు మన ఒళ్లంతా పాకేస్తూ తెగ మసాజ్ చేసేస్తాయి. ఒంటిమీదే కాదు ముఖంమీద కూడా పాములు జరజరా పాకుతుంటే చూడాలి…ద్యావుడా..ఇక చూడాలి ఆ అనుభం..చెప్పుకుంటే తీరేదికాదు..ఇంతకీ ఈ పాములతో మసాజ్ చేసే సెంటర్ ఎక్కుడందనే కదా మీ డౌటు..‘ఈజిప్టులో..
మీరు ఈజిప్టులోని ఈ మసాజ్ సెంటర్‌కు వెళ్లితే..మసాజ్ కావాలా అని అడిగితే ఓకే అన్నారో..ఇక అంతే..పెద్ద పెద్ద్ పైథాన్ లు మీ మీద పాకేస్తూ మసాజ్ చేసేస్తాయి. ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ స్పాలో పాముల మసాజే స్పెషల్. ఈ స్పాలో మనుషులకు బదులు పాములు మసాజ్ చేస్తాయి. చిన్న పాముల నుంచి కొండ చిలువ వరకు ప్రతి పామును కస్టమర్ కు మసాజ్ చేస్తాయి. సుమారు 28 రకాల పాములతో ఇక్కడ ‘స్నేక్ మసాజ్’ను ఆఫర్ ఉంది.
కానీ భయపడాల్సిన పనిలేదు లెండి..ఎందుకంటే మసాజ్ చేసే పాములేవీ విషం లేనివే.మీరు అలా వెళ్లి బెడ్ మీద ఒక్కసారి మసాజ్ బెడ్ మీద పడుకుంటే చాలు.. 30 నిమిషాలు ఆ పాములన్నీ మీ శరీరంపైనే జరజరమని పాకుతూ సుతిమెత్తగా మసాజ్ చేస్తాయి. ఈ పాముల మసాజ్ స్పా యజమాని సఫ్వాత్ సెడ్కీ మాట్లాడుతూ..పాములతో మసాజ్ వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు రిలాక్స్ అవుతాయి. నొప్పులన్నీ మటుమాయం అయిపోతాయి. పాములతో మసాజ్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కేవలం శరీరకంగానే కాదు..పాముల మసాజ్ తో మానసికంగా కూడా మంచి ఫలితాలున్నాయని తెలిపారు.
ఈ పాములు శరీరంపై పాకుతున్నప్పుడు వారిలో కొన్ని భావోద్వేగాలు కలుగుతాయి. దాని వల్ల ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని తెలిపారు.కానీ కస్టమర్లను పాముల మసాజ్‌కు ఒప్పించడం చాలా కష్టమనీ..మొదట్లో చాలా భయపడతారని..కానీ అలవాటు అయితే మళ్లీ మళ్లీ వస్తారని తెలిపారు. మొదట్లో పాములతో మసాజా అని ఆశ్చర్యంగా చూసేవారు. ఆ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించిన తర్వాత చాలామంది ధైర్యం చేసి ముందుకొచ్చారు. తరువాత చాలా బాగుందని తెలిపారని వెల్లడించారు.
ముఖ్యంగా ఈ మసాజ్ చేయించుకునేవారు స్నేక్ ఫోబియా, పాముల భయం ఉన్నవాళ్లు ఈ మసాజ్ చేయించుకొనేవారని ఆ తరువాత వారికి స్నేక్ ఫోబియా పోయిందని వాళ్లే స్వయంగా చెప్పారని సెడ్కీ తెలిపారు. తాము పాముల మసాజ్ ప్రారంభించిన మొదట్లో కస్టమర్లకు ఉచితంగానే అందించామని…అదే క్రమేపీ మంచి ఆదరణ రావటంతో 20 నుంచి 30 నిమిషాలకు 100 ఈజిప్టియన్ పౌండ్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.466 తీసుకుంటున్నామని తెలిపారు.
కస్టమర్లు అడిగే విధానం బట్టి వివిధ రకాల పాములతో మసాజ్ చేస్తారు. శరీరం మీద ముఖం మీద వాటిని వదులుతారు. మీకు కూడా ఇలాంటి మసాజ్ ట్రై చేయాలని ఉంటే తప్పకుండా కైరో వెళ్లండి.