Elephant attacks tourists on boat
Elephant attacks tourists on boat : అటవీ ప్రాంతంలో వాహనాలపై వెళ్తుంటే ఏనుగులు వెంబడించి దాడి చేయడం మనం చూస్తూనే ఉంటాం.. ఒక్కోసారి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తాయి. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. అయితే, సముద్రంలో బోటులో షికారుకెళ్లిన టూరిస్టులపై ఎనుగులు దాడి చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బోట్స్యానాలో కొందరు టూరిస్టులకు భయానక అనుభవం ఎదురైంది. సఫారీ కానో టూర్ సందర్భంగా ప్రఖ్యాత వన్యప్రాణుల ప్రాంతమైన ఒకావాంగో డెల్టాలోని నిస్సార జిల్లాలో బోటులో అమెరికన్, బ్రిటిష్ టూరిస్టులు కొందరు ఏనుగులను చూసేందుకు వెళ్లారు. అక్కడ వారు బోటులో ప్రయాణిస్తూ ఏనుగులను తిలకిస్తూ ఫోన్లు, కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇంతలో ఓ తల్లి ఏనుగు గర్జిస్తూ వారివైపు దూసుకొచ్చింది.
రెండుమూడు బోటుల్లో వెళ్లిన టూరిస్టులు అక్కడ పిల్ల ఏనుగును చూస్తుండగా.. వారిపైకి తల్లి ఏనుగు గర్జిస్తూ దూసుకొచ్చింది. అయితే, తొలుత బోటులోని వారు ఈ ఘటనను సరదాగా తీసుకున్నప్పటికీ.. ఏనుగు వేగంగా బోటువైపునకు దూసుకురావడంతో అలర్ట్ అయ్యారు. బోటును వేగంగా పోనిచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఏనుగు బోటు వద్దకు చేరుకొని దాడి చేసింది. ఈ క్రమంలో టూరిస్టులు పెద్దగా కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. ఏనుగు దాడిలో ఓ మహిళ నీటిలో పడిపోయింది. అయితే, ఆమె ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడింది.
So this happened in the shallow waters of the Okavango Delta, Botswana, on Saturday…🐘pic.twitter.com/oF6SU2Q6r2
— Volcaholic 🌋 (@volcaholic1) September 29, 2025
ఈ దృశ్యాలను తోటి టూరిస్టులు ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏనుగుతోనే ఆటలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆ పర్యాటకురాలు తప్పించుకోవడం చాలా అదృష్టమని అభివర్ణించాడు. ఏనుగు ఆమెపై మరికొన్ని సెకన్ల పాటు దాడిచేసిఉంటే ఆమె ప్రాణాలు పోయేవి. అది తన పిల్లలను ఏదో చేయటానికి వచ్చారని అనుకొని ఉంటుంది. అందుకే రక్షణకోసం దాడి చేసి ఉంటుంది. పర్యాటకులను ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్లే గైడ్స్ జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లితుందని అన్నారు.