రష్యాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రష్యా, జపాన్‌లో సునామీ దూసుకొచ్చింది. అమెరికా, చైనా సహా పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అసలు సునామీ అంటే ఏమిటి? భూకంపానికి, సునామీ ఉన్న లింక్ ఏంటి? అన్న వివరాలు చూద్దాం…
సునామీ అంటే?
సునామీ అంటే సముద్రంలో వరుసగా ఏర్పడే భారీ అలలు. సాధారణంగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్ర గర్భంలో జరిగే ఇతర పెద్ద మార్పుల కారణంగా సునామీలు సంభవిస్తాయి. సునామీలు సాధారణ అలలలా ఉండవు. భారీ ఎత్తున వరుసగా అలలు వస్తాయి. ఇవి చాలా దూరం ప్రయాణిస్తాయి.
తీర ప్రాంతాలకు చేరుకున్న సమయంలో విధ్వంసం సృష్టిస్తాయి. సాధారణ అలలు గాలి వల్ల వస్తాయి.. కానీ, సునామీ అలలు భారీ ఎత్తున నీటితో ఒకేసారి పైకి ఎగుస్తూ వస్తాయి. భూమి పైపొర నిలువుగా కదలడం వల్ల సముద్రపు నీరు పైకి లేదా కిందికి నెట్టినట్లు వెళ్తుంది.
ఈ అలలు సముద్రం మీద జెట్ స్పీడ్‌లతో ప్రయాణిస్తాయి. తీరానికి చేరుకునే సమయంలో ఈ అలలు నెమ్మదిగా ప్రయాణించి ఎత్తు పెరుగుతాయి. కొన్ని సార్లు ఇవి 30 మీటర్లకు పైగా ఎగిసిపడతాయి. సునామీ అనేక కిలోమీటర్ల భూభాగంలోకి ప్రవేశించి పెద్ద భవనాలను సైతం తుడిచిపెట్టేస్తాయి.
భూకంపం అంటే ఏమిటి?
భూమి కింద టెక్టానిక్ ఫ్లేట్‌లు కదలడం వల్ల ఆకస్మికంగా భూమిలో వచ్చే కంపనాన్ని భూకంపం అంటాం. భూమి పైపొర అనేక పెద్ద ఫ్లేట్‌లుగా విడిపోయి మంటలుగా ఉన్న రాళ్లపై తేలుతూ ఉంటుంది. ఈ ఫ్లేట్‌లు ఎప్పటికప్పుడు కదులుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఒక్కసారిగా ఆ ప్రెజర్ విడుదలవుతుంది. ఈ శక్తి భూమి గుండా ప్రయాణించి భూ కదలికలను కారణమవుతుంది. దీంతో భూమి ఉపరితలం కదులుతుంది.
సాధారణంగా, భూమి లోపల ఉన్న శిలలు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా కదిలినప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. ఈ కదలిక భూమి లోపల శక్తిని విడుదల చేస్తుంది. ఇది భూమి ఉపరితలంపై భూకంప తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. దీన్నే భూకంపం అంటాం.
రిక్టర్ స్కేలు లేదా మొమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేలు ద్వారా భూకంప తీవ్రతను కొలుస్తారు. భూకంపం చిన్న కంపనాల నుంచి నగరాలను నేలమట్టం చేసే స్థాయికి భూకంపం వస్తుంది. భూకంపం ప్రారంభ స్థలం ఎక్కడ ఉందో దానిని ఎపిసెంటర్ (భూకంప కేంద్రం) అంటారు. భూకంపం ఉద్భవించిన భూమి ఉపరితలం పై స్థానం ఇది.
సునామీకి భూకంపం కారణమవుతుందా?
చాలా సునామీలు సముద్రం అడుగున జరిగే భూకంపాల వల్ల వస్తాయి. ముఖ్యంగా సబ్‌డక్షన్ జోన్లలో ఒక ఫ్లేట్ మరొక ఫ్లేట్ కిందికి జారే చోట్ల ఇవి సంభవిస్తాయి. ఈ ప్లేట్‌లు అకస్మాత్తుగా కదిలితే నీరు నిలువుగా పైకి దూసుకొస్తుంది. ఇది సునామీ అలలకు కారణమవుతుంది.
దీని వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సునామీ వార్నింగ్ సిస్టంలు సముద్ర భూకంపాలను జాగ్రత్తగా పరిశీలిస్తాయి. సాధారణంగా 7.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే వెంటనే హెచ్చరికలు ఇస్తారు. అయితే ప్రతి సముద్రపు భూకంపం సునామీకి దారితీయదు. కేవలం నిలువుగా కదిలే, తక్కువ లోతులో సంభవించే భూకంపాలే సునామీకి దారితీస్తాయి.