Turkey Steel Plant Explosion : టర్కీలో భారీ పేలుడు.. స్టీల్ ప్లాంట్‌లో 16 మంది మృతి.. 13మందికి తీవ్రగాయాలు..!

Turkey Steel Plant Explosion : టర్కీలోని HABAS స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. క్రేన్ ఫర్నేస్‌లో పడటంతో చెలరేగిన మంటల్లో 16 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభమైంది.

Turkey Steel Plant Explosion

  • టర్కీ స్టీల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం
  • మంటల్లో కాలిపోయిన స్టీల్ ప్లాంట్..
  • బాయిలర్ మారుస్తుండగా పెను ప్రమాదం..

Turkey Steel Plant Explosion : టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ టర్కీలోని ఇజ్మీర్ ప్రావిన్స్ అలియాగా ప్రాంతంలో ఉన్న హబాస్ (HABAS) ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాంట్‌లో బాయిలర్ మార్పు పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాత బాయిలర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా ఓ క్రేన్‌ను ఉపయోగిస్తున్నారు.

అయితే, అనూహ్యంగా ఆ క్రేన్ అదుపుతప్పి ఫర్నేస్‌లో పడిపోయింది. దీంతో సమీపంలోని స్టీల్ మిల్లులో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు..

Read Also : Gold Price Today Nov 10 : బంగారం కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. ఒక్కరోజే భారీగా పెరిగిన ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ప్లాంట్‌లో 200 మంది కార్మికులు :
ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ పరిసరాల్లో సుమారు 200 మంది కార్మికులు ఉన్నట్లు ప్రావిన్షియల్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ వెల్లడించారు. సాధారణంగా అక్కడ 300 మంది వరకు పనిచేస్తుంటారని, బాయిలర్ మార్పు కారణంగా ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆ సమయంలో కార్మికుల సంఖ్య తగ్గిందని తెలిపారు..

పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. భారీ శబ్దంతో పాటు ఆకాశంలోకి ఎగసిన పొగను చూసి చాలామంది భూకంపం వచ్చిందేమోనని భయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, అత్యవసర బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టాయి..

ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు, ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలపై న్యాయపరమైన, పరిపాలనా విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. బాధ్యులెవరైనా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పారిశ్రామిక కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేసిన ఈ ప్రమాదం టర్కీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది..