టెంట్లు కూలిపోయాయి : ఎవరెస్ట్ ను తాకిన తుఫాన్ గాలులు

  • Publish Date - May 4, 2019 / 03:43 AM IST

ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యాంపులోని 20 టెంట్లు కూలిపోయాయి.
తుఫాన్ తీవ్రత, దాని పరిణామాలను అంచనా వేసిన వాతావరణ శాఖ.. ముందుగానే సమాచారం ఇచ్చింది. దీంతో ఎవరెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేసే ఏజెన్సీలు, సిబ్బంది, పర్యాటకులకు నేపాల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే కొత్తగా ఎవరినీ ఎవరెస్ట్ పైకి అనుమతించలేదు. అప్పటికే అక్కడ ఉన్న వారు మాత్రం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈదురుగాలులకు బేస్ క్యాంప్ లో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. పర్యాటకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని నేపాల్ గర్నమెంట్ ప్రకటించింది.
తుఫాన్ ప్రభావంతో గాలులతోపాటు వర్షం కూడా పడింది. మరో 3, 4 రోజులు వాతావరణం అనుకూలించదని.. ఎవరూ కూడా ఎవరెస్ట్ పర్వతం ఎక్కొద్దని ఆదేశించింది నేపాల్ ప్రభుత్వం. తుఫాన్ తీరం దాటిన తర్వాత హెలికాఫ్టర్ల రాకపోకలను కూడా నిషేధించారు.