Emmanuel Macron: డ్రోన్ దాడిలో ఫ్రెంచ్ సైనికుడు మృతి.. వెంటనే ఇరాక్ ప్రధానితో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు హామీ ఇచ్చినందుకు బాగ్దాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
- Naveen
- Published On : March 14, 2026 / 05:41 PM IST
Emmanuel Macron Representative Image (Image Credit To Original Source)
- ఇరాక్ లో డ్రోన్ దాడి
- ఒక ఫ్రెంచ్ సైనికుడు మృతి, ఆరుగురు సైనికులకు గాయాలు
- ఇరాక్ ప్రధానితో మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ఫ్రెంచ్ దళాల రక్షణకు చర్యలు తీసుకోవాలన్న మాక్రాన్
Emmanuel Macron: ఇరాక్‌లో జరిగిన ఓ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించాడు. అనేక మంది గాయపడ్డారు. ఫ్రెంచ్ సైనికుడి మృతి వార్త తెలియగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్-సుడానీతో మాట్లాడారు. ఈ దాడి “ఆమోదయోగ్యం కాదు” అని మాక్రాన్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తునకు హామీ ఇచ్చినందుకు బాగ్దాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి కృషి చేస్తూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, దేశంలో స్థిరత్వం సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఇరుపక్షాలు సమన్వయంతో కృషి చేస్తాయని మాక్రాన్ చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు చనిపోయాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ఇరాన్ ప్రధానితో మాట్లాడారు. దాడి ఎలా జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫ్రెంచ్ దళాల రక్షణకు చర్యలు తీసుకున్నందుకుగాను ఇరాక్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు మాక్రాన్.
”నిన్న, నేను ఇరాక్ ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీతో మాట్లాడాను. ఈ దాడిపై దర్యాఫ్తు చేయాలని కోరాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాకీలతో కలిసి పోరాడేందుకు ఇరాక్‌లో ఉన్న మన దళాల రక్షణ కోసం చర్యలను బలోపేతం చేస్తామన్నారు. ఆయన చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలుపుతున్నా” అని మాక్రాన్ Xలో పోస్ట్ పెట్టారు.
ఇరాకీ కుర్దిస్తాన్‌లోని ఎర్బిల్ ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన డ్రోన్ దాడిలో 42 ఏళ్ల ఆర్నాడ్ ఫ్రియోన్ మరణించాడు. మరో ఆరుగురు ఫ్రెంచ్ సైనికులు గాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత మరణించిన మొదటి ఫ్రెంచ్ సైనికుడు ఆర్నాడే.
“దేశ స్థిరత్వం, సార్వభౌమత్వ పరిరక్షణకు, అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి మేము మా సమన్వయాన్ని, ప్రయత్నాలను కొనసాగిస్తాము” అని మాక్రాన్ అన్నారు. ఫ్రెంచ్ సైనికుడి మరణం తర్వాత దాడులను నిరోధిస్తామని, ఫ్రెంచ్ సైనికులకు రక్షణ కల్పిస్తామని ఇరాక్ ప్రధాని మాటిచ్చారని వెల్లడించారు.
Also Read: రంగంలోకి కిమ్.. ఒకేసారి 10 మిస్సైళ్ల ప్రయోగం.. ఏం జరుగుతోంది
