T12
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్ లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. అమెరికా దళాలు అప్ఘానిస్తాన్ ని పూర్తిగా ఖాళీ చేసి వెళ్లడంతో తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నారు. ఇప్పటివరకు మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్లు..ఇప్పుడు స్వలింగ సంపర్కులను వెంటాడుతున్నారు. తాజాగా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ స్వలింగ సంపర్కుడిపై తాలిబన్లు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
అప్ఘానిక్ చెందిన బాధిత స్వలింగ సంపర్కుడు ఇటీవల దేశం దాటి వెళ్లేందుకు ఒకరి సహాయం కోరారు. సోషల్ మీడియా ద్వారా అతనితో మాట్లాడారు. తనకు సహాయం చేసే వ్యక్తిని కలవడానికి ముందు మూడు వారాల పాటు సామాజిక మాధ్యమాల్లోనే సంప్రదింపులు చేశారు. అయితే, తాను సంప్రదింపులు జరిపిన ఆ వ్యక్తి తాలిబన్ మనిషేనని తెలుకోలేకపోయాడు స్వలింగసంపర్కుడు. ఈ క్రమంలోనే ఇద్దరు తాలిబన్లు ఆ స్వలింగసంపర్కుడిపై దాడికి చేసి రేప్ చేశారు.
ఈ ఘటనతో అక్కడి స్వలింగ సంపర్కులు హడలెత్తిపోతున్నారు. తాలిబన్ల క్రూరత్వాన్ని చూసి అప్ఘానిస్తాన్ లోని అనేక మంది స్వలింగ సంపర్కులు దేశం విడిచి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అప్ఘాన్ కి చెందిన ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడు ఆర్టెమిస్ అక్బరీ తెలిపారు. ప్రస్తుతం టర్కీలో తలదాచుకుంటున్న అక్బరీ..స్వలింగ సంపర్కుడిపై దాడి,రేప్ ఘటనని తీవ్రంగా ఖండించారు.