Nepal Protests: నేపాల్‌లో హింస.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం.. షాకింగ్ వీడియో..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నేపాల్‌లో జనరల్-జెడ్ నేతృత్వంలోని నిరసనలు ఆగడం లేదు.

Nepal Protests: నేపాల్ లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు.

మాజీ ప్రధాని జలనాథ్ కనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పటించారు. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య ఉన్నారు. మంటల్లో చిక్కుకుని ఆమె మరణించారు. మాజీ ప్రధాని భార్య రబి లక్ష్మి చిత్రకార్ సజీవదహనం అయ్యారని తెలుస్తోంది. నిరసనకారులు ఆమెను ఇంట్లో బంధించిన ఇంటికి నిప్పటించారని సమాచారం. నేపాల్ రాజధాని కాట్మండులోని డల్లులో ఈ ఘోరం జరిగింది.

కాలిన గాయాలతో ఉన్న చిత్రకార్ ను కుటుంబసభ్యులు కీర్తిపూర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె చనిపోయారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నేపాల్‌లో జనరల్-జెడ్ నేతృత్వంలోని నిరసనలు ఆగడం లేదు. ప్రదర్శనల రెండవ రోజు మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 22 కి చేరుకుంది. 300 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాని పదవి నుంచి ఓలిని తొలగించాలని, ప్రభుత్వాన్ని తప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.