Beer (Photo : Google)
Instant Beer Powder : బీర్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఇకపై ఎప్పుడు కావాలంటే అప్పుడు బీర్ తాగొచ్చు. బీర్ కోసం వైన్ షాపులకు వెళ్లాల్సిన పని లేదు, బీరు బాటిళ్లు మోసుకుని రావాల్సిన బాధ అంతకన్నా లేదు. ఎంచక్కా ఉన్న చోటే మీ ఇంట్లోనే బీర్ తయారు చేసుకోవచ్చు. అది కూడా క్షణాల్లోనే. ఏంటి.. షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ, ఇది నిజం.
అవును.. జర్మనీకి చెందిన బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్బూ (Neuzeller Klosterbrau) సంస్థ ప్రపంచంలోనే తొలి ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను తయారు చేసింది. ఈ పౌడర్ మన దగ్గర ఉంటే చాలు.. ఇట్టే బీరు తయారు చేసుకోవచ్చు. వైన్ షాపులకు వెళ్లకుండానే టీ లేదా కాఫీ పెట్టుకున్నట్లుగా ఇంట్లోనే బీర్ తయారు చేసుకోవచ్చు.
ఒక గ్లాసులో రెండు స్పూన్ల బీర్ పొడిని వేసి నీళ్లు పోసి షేక్ చేయాలి. అంతే బీర్ రెడీ అయిపోతుందట. ఈ ఇన్ట్ స్టంట్ బీర్ పౌడర్ ద్వారా బీర్ రవాణ భారీగా తగ్గుతుందని.. కిలో బీర్ రవాణ స్థానంలో కేవలం 45 గ్రాముల పౌడర్ సరిపోతుందని ఆ సంస్థ వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి నాన్ ఆల్కహాలిక్ బీర్ పౌడర్ తయారు చేశారు. త్వరలోనే ఆల్కహాలిక్ వెర్షన్ కూడా తీసుకొస్తారట. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారట.