గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితానికి సరిపడా ప్రమోషన్ దక్కించేసుకున్నారు. సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గే బ్రిన్ చేతుల మీదుగా గూగుల్‌తో పాటు ఆల్ఫా బెట్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు అందుకున్నారు. కొత్త ఉద్యోగంతో పిచాయ్ సంపాదన ఎంతో తెలుసా.. అక్షరాల ఒక వెయ్యి ఏడువందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అతని ఖాతాలో పడనున్నాయి.
240మిలియన్ డాలర్ల స్టాక్ ప్యాకేజీతో పాటు 2మిలియన్ డాలర్లు వార్షిక వేతనంగా ఇవ్వనున్నారు. 2020నుంచి అమలుకానున్న కొత్త వేతనం ఇలా ఉంటే గతంలో పిచాయ్ 1.8మిలియన్ డాలర్ల వేతనం తీసుకునేవారు. గూగుల్‌కు సీఈఓగా అపాయింట్ అయినప్పటి నుంచి ఇదే వేతనం తీసుకుంటున్నారు. సుందర్ పిచాయ్.. 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఖరగ్ పూర్‌లోని ఐఐటీలో మెటలార్జికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేశారు. 2015లో పిచాయ్ గూగుల్ కు సీఈవోగా అపాయింట్ అయ్యారు. అల్ఫాబెట్ సంస్థ వామో(సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్), వెరిలీ(లైఫ్ సైన్సెస్), కాలికో (బయో టెక్ ఆర్&డీ), సైడ్ వాక్ లాబ్స్(అర్బన్ ఇన్నోవేషన్, లూన్(రూరల్ ఇంటర్నెట్ యాక్సెస్ వయా బెలూన్)ను వంటి ఉత్పత్తులు కొనసాగిస్తోంది.