Heritage Hindu temple
Heritage Hindu temple: కెనడాలో మరోసారి ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలు అక్కడి భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిరంలో దుండగులు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఆలయంపై జరిగిన దాడిని టొరొంటోని భారత కాన్సులేట్ జనరల్ ఖండించారు.
”మందిరంపై దుండగులు పాల్పడ్డ ద్వేషపూరిత చర్యతో కెనడాలోని భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని కెనడా అధికారుల వద్ద లేవనెత్తాము” అని అక్కడి భారత దౌత్య కార్యాలయం ప్రకటన చేసింది. భారతీయ వారసత్వానికి ప్రతీకగా ఉన్న మందిరంపై దాడికి పాల్పడి, ద్వేషపూరిత రాతలు రాయడంపై కెనడా అధికారులు విచారణ జరుపుతున్నారు.
గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు కెనడాలో మూడు సార్లు హిందూ మందిరాలపై దాడులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. కెనడాలో భారతీయులపై నేరపూరిత చర్యలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, సరైన విచారణ జరపాలని చెప్పింది. కెనడాలో కొంత కాలంగా మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న ఘటనలు విపరీతంగా పెరిగాయి.
Telangana Govt Invited Governor : బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం