Bangladesh Police Representative Image (Image Credit To Original Source)
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కరువైంది. అక్కడ హిందువులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు హిందువులు హత్యకు గురయ్యారు. తాజాగా మరో హిందువును చంపారు. అరటి పండ్ల విషయంలో జరిగిన వివాదం వ్యాపారి హత్యకు దారితీసింది.
మృతుడు లిటన్ చంద్ర ఘోష్ (55) ఘాజీపూర్‌లో హోటల్ నిర్వహిస్తున్నాడు. స్థానికుడైన మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. అయితే, తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో లిటన్ హోటల్ దగ్గర అరటి పండ్లు కనిపించాయి. అంతే.. మాసుమ్, అతడి తల్లిదండ్రులు చంద్ర ఘోష్ తో వాగ్వాదానికి దిగారు. ఇది దాడి చేసే వరకు వెళ్లింది. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
”లిటన్ చంద్ర ఘోష్.. బైసాక్షి స్వీట్ మీట్ అండ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. అరటి పండ్ల విషయంలో లిటన్, మాసుమ్ మధ్య గొడవ జరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. మాసుమ్ మియా.. లిటన్‌ను కొట్టాడు. ఆ తర్వాత తోసేశాడు. దీంతో లిటన్ కిందపడిపోయాడు. స్పాట్ లోనే అతడు చనిపోయాడు” అని పోలీసులు తెలిపారు. లిటన్ చంద్ర ఘోష్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా, హిందువుల వరుస హత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారు.
డిసెంబర్ లో దాస్ దారుణ హత్య..
2025 డిసెంబర్ లో 27 ఏళ్ల గార్మెంట్ వర్కర్ దీపు చంద్ర దాస్ అనే హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. దైవ దూషణ ఆరోపణలతో అతడిపై మూక దాడి జరిగింది. కొట్టి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టారు. అది మొదలు.. అక్కడ హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 10 మంది హత్యకు గురయ్యారు. 51 మందిపై దాడులు జరిగాయి. హిందువులకు రక్షణ కల్పించాలని హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: ఇరాన్ ఆందోళనల్లో 5,000 మంది మృతి.. 24,000 మందికి పైగా అరెస్టు.. ఇంకా ఏం జరగనుంది?