Hitler Eagles Nest : హిట్లర్ విడిది చేసిన చారిత్రాత్మక భవనం ‘ఈగిల్స్ నెస్ట్’లో అగ్నికీలలు.. 200 మంది రంగంలోకి..
Hitler Eagles Nest : జర్మనీలో హిట్లర్ చారిత్రక ఈగిల్స్ నెస్ట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగింది?
- Harish Thanniru
- Published on- October 25, 2026 / 11:34 AM IST
Eagles Nest
Hitler Eagles Nest : జర్మనీలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గతంలో ఉపయోగించిన చారిత్రక భవనం భారీ అగ్నిప్రమాదానికి గురైంది. దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో ఉన్న ‘ఈగిల్స్ నెస్ట్’ భవనంలో అక్టోబర్ 23వ తేదీ రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధం ఉండొచ్చన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
బెర్చ్టెస్గాడెన్ ప్రాంతంలోని పర్వత శిఖరంపై ఉన్న ఈ భవనంలో మంటలు చెలరేగినట్లు శుక్రవారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఎత్తైన పర్వత ప్రాంతం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మంచు కారణంగా మంటలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భవనం పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న 33 ఏళ్ల జర్మనీ పౌరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి ఈ ఘటనతో సంబంధం ఉందా, ప్రమాదం వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈగిల్స్ నెస్ట్ భవనాన్ని 1938లో నాజీ అధికారులకోసం అతిథి గృహంగా నిర్మించారు. జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఈ పర్వతంపై 1,834 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ విడిది గృహాన్ని అడాల్ఫ్ హిట్లర్ కూడా అప్పుడప్పుడు సందర్శించేవాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఈ భవనాన్ని నాజీ చరిత్రకు సంబంధించిన చారిత్రక కట్టడంగా పరిరక్షించారు. 1952 నుంచి ఇక్కడ రెస్టారెంట్, కేఫ్‌తో పాటు ఆ కాలపు చరిత్రను వివరించే ప్రదర్శన కూడా కొనసాగుతోంది. తాజా అగ్నిప్రమాదంతో ఈ చారిత్రక కట్టడం తీవ్రంగా దెబ్బతినడంతో దాని భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవనాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని బవేరియా రాష్ట్ర అధికారులు తెలిపారు.
