Gold Rate Decrease : పడిపోతున్న గోల్డ్ రేటు.. ఆల్‌టైమ్ హై నుంచి 26శాతం డౌన్.. ఇప్పుడు కొనాలా? వద్దా? నిపుణులు చెప్పేది ఇదే..
Gold Rate Decrease : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు వేగంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ కొనుగోలు చేయొచ్చా..? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..? అనే అంశాలపై మార్కెట్ నిపుణులు కీలక సూచనలు చేశారు.
Gold Rate Decrease
Gold Rate Decrease : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు వేగంగా పడిపోతోంది. మిడిలీస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు.. ప్రస్తుతం తమ గరిష్ట స్థాయిల నుంచి 26 శాతానికి పైగా తగ్గాయి.
Also Read : YS Jagan: అంజిలి పెళ్లిపై వైఎస్ జగన్ క్లారిటీ.. సంచలన లేఖ విడుదల.. టీడీపీ కల్పిత కథనాలపై వైసీపీ ఫైర్!
మిడ్ టర్మ్ ఎన్నికల తర్వాత దాడులు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం.. హార్ముజ్‌లో ఇరాన్ వరుస దాడులకు దిగుతుండడంతో.. ముడి చమురు మళ్లీ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఆందోళనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇక అటు వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలో కొనసాగే అవకాశాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
మాములుగా అయితే అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ బలపడటం, ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరగడంలాంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయినా సరే.. బంగారం ధరలు దీర్ఘకాలంలో మళ్లీ పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగడం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం.. పసిడికి మద్దతిచ్చే అంశాలుగా ఉన్నాయి. దీంతో ప్రస్తుత ధరల పతనాన్ని బంగారం దీర్ఘకాలిక పెరుగుదల ధోరణికి ముగింపుగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 28న.. బంగారం ధర ఔన్సుకు 5వేల 419 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అది 4వేల డాలర్లకు పడిపోయింది. అంటే.. రికార్డు గరిష్ట స్థాయి నుంచి 26 శాతానికి పైగా తగ్గింది.
మరికొద్దిరోజుల్లో దీపావళి, ఆ తరువాత పెళ్లిళ్ల సీజన్. దీంతో గోల్డ్ ధరలు తగ్గుతుండడంతో.. కొనుగోళ్లపై చాలా కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో రేట్లు మరింత పడిపోతాయా.. ఇప్పుడు కొనుగోలు చేయాలా వద్దా అనే కన్ప్ఫూజన్ చాలామందిలో కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో.. సరైన కొనుగోలు స్థాయిని గుర్తించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాల్సిన కుటుంబాలు.. మొత్తం ఆభరణాలను ఒకేసారి కొనకుండా, తమ బడ్జెట్‌ను మూడు, నాలుగు భాగాలుగా విభజించుకోవాలని చెప్తున్నారు. ఇందులో మొదటి భాగాన్ని ప్రస్తుత ధరల దగ్గర కొనుగోలు చేసి.. ధరలు మరింత తగ్గితే నెక్ట్స్ భాగాలను కొనడాన్ని పరిశీలించాలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గోల్డ్ ధర లక్షా 40వేల స్థాయికి చేరితే.. కొనుగోలు అవకాశాన్ని పరిశీలించవచ్చు అని అంటున్నారు. ఒకవేళ లక్షా 40వేల కంటే కు బలంగా పడిపోతే.. తదుపరి ముఖ్యమైన స్థాయి లక్షా 36వేలు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరల దిశను అంచనా వేయడానికి.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, వ్యక్తిగత వినియోగ వ్యయాల ద్రవ్యోల్బణ గణాంకాలు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడుల ప్రవాహాలను గమనించాలి. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఎలా మారుతున్నాయి, చమురు ధరలు ఏ దిశగా కదులుతున్నాయనే అంశాలు కీలకంగా మారనున్నాయి.
భారతదేశంలో రూపాయి విలువలో మార్పులు కూడా.. దేశీయ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా, రూపాయి బలహీనపడితే దేశీయంగా ధరల తగ్గుదల పరిమితంగా ఉండే చాన్స్ ఉంది. ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయకుండా, తమ పెట్టుబడి లక్ష్యాలు, కాలపరిమితి, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఆధారంగా విడతల వారీగా కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాబోయే రోజుల్లో బంగారం ధర ఔన్సుకు 3వేల 950 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో ఇది సుమారు లక్షా 40వేల రూపాయల స్థాయికి అనుగుణంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే రానున్న రెండు, మూడు నెలల్లో బంగారం ధరలు స్థిరపడితే 10 నుంచి 15 శాతం వరకు పుంజుకునే అవకాశముందనేది మరికొందరి అభిప్రాయం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4వేల 2వందల డాలర్ల పైన నిలకడగా కొనసాగితే.. కొత్త పెరుగుదల ధోరణి ప్రారంభమైనట్లు భావించవచ్చని చెప్తున్నారు.
మరోవైపు వెండి ధరలుకూడా వేగంగా పడిపోతున్నాయి. ఏకంగా రెండు లక్షలకు పైగా తగ్గిపోయింది. జనవరిలో కిలో సిల్వర్ ఏకంగా 4లక్షల 25వేలకు చేరుకొని చరిత్రలో ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ప్రస్తుతం శనివారం నాటికి కిలో వెండి ధర 2లక్షల 2వేల దగ్గర ఉంది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 2లక్షలు పడిపోయిందన్నమాట. సిల్వర్ ధరలు డౌన్ అవుతుండటంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశముందనే అంచనాలతో మరికొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
