ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత్‌కు కష్టకాలమేనా.. ట్రంప్ విధానాలు మనకు ఇబ్బందిగా మారనున్నాయా?

ట్రంప్ కంటే కమలా హారిస్ గెలిస్తేనే భారత్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలన్న వ్యక్తి కావడంతో పాటు.. హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి.

How Donald Trump comeback impact on India explained here

Donald Trump: అగ్రరాజ్యం ఎన్నికలు భారత్‌లో ఆసక్తి రేపుతున్నాయి. ట్రంప్ గెలిస్తే మనకు లాభమా.. నష్టమా అన్న చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్‌, నరేంద్రమోదీ మధ్య మంచి స్నేహబంధాలు ఉన్నాయి. అమెరికాలోని మోదీ అభిమానులు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ భారత్ విషయంలో ట్రంప్ వైఖరే మారుతూ వస్తోంది. నేషన్ ఫస్ట్ అనే రూల్ ఫాలో అయ్యే ట్రంప్ ప్రతీది అమెరికాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే గతంలో అతను ఫాలో అయిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ మనకు అనుకూలంగా లేవు. ట్రంప్ కంటే కమలా హారిస్ గెలిస్తేనే భారత్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలన్న వ్యక్తి కావడంతో పాటు.. హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి.

ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో..అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10 శాతం సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్‌ నుంచి ఎగుమతులను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే అమెరికాకు 120 బిలియన్ డాలర్ల విలువైన వస్తు-సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్-యూఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. హార్లే-డేవిడ్‌సన్‌ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్‌ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుందని ప్రచార సభల్లో వివరిస్తూ వస్తున్నారు. భారత్‌లో వందశాతం, నూటయాభై శాతం, రెండువందల శాతం పన్నులు ఉన్నాయని.. అలా అయితే అమెరికా కంపెనీలు భారత్‌తో ఎలా వ్యాపారం చేయగలవంటూ ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌ 2వందల శాతం పన్నులు వసూలు చేస్తుంటే..అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

దిగుమతి సుంకం పెంచడమే కాదు.. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయులకు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి వలస వెళ్లే ఇండియన్ అమెరికన్స్‌పై ఆంక్షలు మరింత కఠినతరం కావచ్చు. ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడంతో పాటు H1B వీసా గైడ్‌లైన్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మాస్టర్స్ చేసేందుకు ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన..భవిష్యత్‌లో యూఎస్‌కు వెళ్లబోతున్న ఇండియన్స్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ట్రంప్ గెలిస్తే మన ఆర్థిక విధానాలను సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. అయితే 2019లో ట్రంప్ ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే ఇక అంతర్జాతీయ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఆసియాలోని అమెరికా మిత్రదేశాలకు ట్రంప్ సహకరించే అవకాశం లేదు. సేమ్‌టైమ్ భారత్-రష్యా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్రంప్ అధ్యక్షుడైతే వచ్చే నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరులో ట్రంప్ భారత్‌తో కలసి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్‌ చైనాకు బద్ధ వ్యతిరేకి. చైనా, పాక్ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. ట్రంప్‌ గతంలో అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కే జరిగింది. చైనాతో ట్రంప్‌ తెగదెంపులు చేసుకోవడం వల్లే పుల్వామా, గల్వాన్ ఘటనల్లో యూఎస్ భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్‌ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేమ్‌. భారత్‌, అమెరికా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్‌ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చన్నది అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతుండటం..భారత్‌పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు