సునీతా విలియమ్స్‌ ఇక భూమిపైకి 2025లోనే వస్తారా? నాసా కొత్త ప్రణాళిక ఏంటంటే?

స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంటే నాసా ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్.

సునీతా విలియమ్స్‌ ఇక భూమిపైకి 2025లోనే వస్తారా? నాసా కొత్త ప్రణాళిక ఏంటంటే?

Sunita Williams and Butch Wilmore

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మళ్లీ తిరిగి వచ్చేది ఎప్పుడన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. దాదాపు 60 రోజులుగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని తిరిగి సురక్షితంగా భూమి మీదకు ఎలా తీసుకురావాలన్న విషయంపై అన్ని సాధ్యాసాధ్యాలను నాసా బేరీజు వేసుకుంది.

సునీత, విల్మోర్ తిరిగి ఎప్పుడు వస్తారన్న విషయంపై తాజాగా నాసా అధికారి ఒకరు స్పందించారు. స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా వారు తిరిగి భూమి మీదకు రావడం ఇప్పటికీ సురక్షితం కాకపోతే వారిద్దరినీ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా 2025 ఫిబ్రవరిలో తీసుకొస్తామని అన్నారు.

కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరినీ స్టార్‌లైనర్‌ ద్వారా తీసుకురావడానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ఇతర ఆప్షన్లనూ పరిశీలించామని తెలిపారు. ఇందులో భాగంగానే స్పేస్ ఎక్స్‌తో కలిసి పనిచేస్తున్నామని, క్రూ 9 ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను తీసుకువచ్చే ప్రణాళికలనూ సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పారు.

స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంటే నాసా ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్. దీని ద్వారా నలుగురు వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపాల్సి ఉంది. వీరిలో జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్‌, రోస్కోస్మోస్ వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ ఈ నెల 18నే ప్రారంభం కావాల్సి ఉండగా, బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఇది సెప్టెంబర్ 24కి వాయిదా పడింది.

బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను సురక్షితంగా తీసుకురావడం సాధ్యం కాకపోతే, ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారానే 2025 ఫిబ్రవరిలో వారిని తీసుకొస్తామని నాసా అంటోంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారానే సునీత, విల్మోర్‌ను తీసుకురావాలని నాసా భావిస్తే ఇందులో భూమి పై నుంచి ఇద్దరు వ్యోమగాములను మాత్రమే అంతరిక్ష కేంద్రానికి పంపుతారు.

Also Read: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత