Mexico El Mencho : కొంపముంచిన ప్రియురాలు.. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్‌మెంచో హతం వెనుక బిగ్ స్కెచ్.. ఫాలో అయ్యి లేపేశారు..
Mexico El Mencho : మెక్సికో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం గగనతల మార్గం ద్వారా మెక్సికో సిటీకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించగా.. అక్కడికి చేరుకునేలోపే ఎల్ మెంచో మరణించాడు.
- Harishth Thanniru
- Published On : February 24, 2026 / 12:11 PM IST
El Mencho
- డ్రగ్ డాన్ ఎల్ మెంచోను హతమార్చిన మెక్సికో సైన్యం
- ప్రత్యేక ఆపరేషన్ వివరాలు వెల్లడించిన ఆ దేశ రక్షణ మంత్రి
- ప్రియురాలిని ట్రాక్ చేసి.. ఎల్ మెంచోను హతమార్చిన సైన్యం
Mexico El Mencho : ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్‌పిన్‌గా పేరుగాంచిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగువెరా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో హతమైన విషయం తెలిసిందే. 59ఏళ్ల ఎల్ మెంచోను అదుపులోకి తీసుకునేందుకు అతడి స్వరాష్ట్రమైన హలిస్కోలోని తపాల్పాలో మెక్సికో సైన్యం ఆదివారం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రాంతాన్ని సైన్య చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. అయితే, ఎల్ మెంచో అనుచరులు ఎదురు కాల్పులు జరపడంతో మెక్సికో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం మెక్సికో సిటీకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించగా.. అక్కడికి చేరుకునేలోపే అతను మరణించాడు.
Also Read : ప్రపంచ దేశాలను వణికించిన డాన్.. అతడిని లేపేసినప్పటికీ మంటల్లో మెక్సికో.. అంతగా ఎల్ మెన్చో ఎలా ఎదిగాడంటే?
ఎల్ మెంచో హతమయ్యాక పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్భందించారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, బ్యాంకులకు నిప్పంటించారు. వారి దాడుల్లో 25మందికిపైగా నేషనల్ గార్డ్ సభ్యులు చనిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయించారు. మెక్సికో రక్షణ శాఖ చేపట్టిన ఆపరేషన్‌లో ఎల్ మెంచో అనుచరులుసైతం పెద్ద సంఖ్యలో మరణించారు.
కొంపముంచిన ప్రియురాలు..
మోస్ట్ వాటెండ్ డ్రగ్ కింగ్‌పిన్‌గా పేరుగాంచిన ఎల్ మెంచో కోసం మెక్సికో దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. వ్యూహాత్మక ప్లాన్ వేశాయి. అతన్ని పట్టుకునేందుకు అతని ప్రియురాలి కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. ఆమె ద్వారా డ్రగ్ డాన్ నివాస స్థావరంపై దాడులు చేశారు. అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన విషయాలను ఆ దేశ రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా వెల్లడించారు.
అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో..
ఎల్ మెంచో ప్రియురాలికి నమ్మకస్థుడైన అనుచరుడిపై మెక్సికన్ మిలిటరీ నిఘా పెట్టింది. అతనితో కలిసి ఆమె గత శుక్రవారం తపాల్పాలో ఎల్ మెంచోను కలిసింది. వారు కలిసిన కచ్చితమైన లొకేషన్‌ను అమెరికా నిఘా వర్గాలు మెక్సికో సైన్యంకు షేర్ చేశాయి. తన సొంత రాష్ట్రం హలిస్కోలో ఉన్నట్లు గుర్తించి.. మరుసటి రోజు ఎల్ మెంచో ప్రియురాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత మెక్సికో ప్రత్యేక దళాలు ఆపరేషన్ ప్రణాళికను ఖరారు చేశాయి. ఎల్ మెంచో అక్కడే ఉన్నాడని నిర్ధారణ అయిన తరువాత.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మెక్సికో దళాలు.. హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అతని అనుచరులు కాల్పులు జరపడంతో మెక్సికో సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ క్రమంలో ఎల్ మెంచోకు కూడా గాయాలయ్యాయి. దీంతో అతన్ని గగనతలం ద్వారా ఆస్పత్రికి తరలించగా.. అక్కడికి చేరుకునేలోపే మరణించాడు.
ఇద్దరు బాడీగార్డులతో పారిపోయేందుకు యత్నం..
ఎల్ మెంచో ఉన్న ప్రాంతాన్ని మెక్సికో సైన్యం చుట్టుముట్టింది. ఆ సమయంలో అతని అనుచరులు, మెక్సికో సైన్యంకు మధ్య కాల్పులు జరిగాయి. ఇదే సమయంలో ఇద్దరు బాడీగార్డుల సహకారంతో ఎల్ మెంచో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తరువాత అండర్ గ్రౌండ్‌లో దాక్కున్నాడు. ఆ ప్రాంతాన్ని గుర్తించిన మెక్సికో సైన్యం.. భీకర కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. ఒకవేళ ఎల్ మెంచో పట్టణం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. అతన్ని పట్టుకునేందుకు శివారు ప్రాంతాల్లో ఆరు హెలికాప్టర్లు, అదనపు దళాలను కూడా మెక్సికో సైన్యం మోహరించింది.
