ప్రపంచ దేశాలను వణికించిన డాన్.. అతడిని లేపేసినప్పటికీ మంటల్లో మెక్సికో.. అంతగా ఎల్ మెన్చో ఎలా ఎదిగాడంటే?
మత్తుపదార్థాలను అమెరికాకు షిప్ చేసేవాడు. అలాగే ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికాకు కూడా డ్రగ్స్ పంపేవాడు.
El Mencho
El Mencho: అతడి పేరు నెమెసియో రూబెన్ ఒసెగెరా సర్వాంటెస్.. ఎల్ మెన్చో అనే పేరుతో పాపులర్ అయ్యాడు. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సిజెఎన్జి) స్థాపకుడు. ఈ కార్టెల్ మెక్సికోలో శక్తిమంతమైన, హింసాత్మక డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటి.
ఈ కార్టెల్ ఎన్నో దేశాలను ముప్పుతిప్పలు పెట్టింది. మత్తుపదార్థాలను అమెరికాకు షిప్ చేసేది. అలాగే ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికాకు కూడా డ్రగ్స్ పంపేది.
డ్రగ్స్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి..
మిచోకాన్‌లోని అగ్యూయిల్లాలో జన్మించిన ఎల్ మెన్చో ఒసెగెరా 1990 దశకంలో డ్రగ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. చిన్నవయసులో యునైటెడ్ స్టేట్స్ కి వెళ్లి, 1994లో కాలిఫోర్నియాలో డ్రగ్స్ పంపిణీ చేసిన నేరంలో శిక్ష అనుభవించాడు.
ఆ తర్వాత మెక్సికోకు డిపోర్ట్ అయ్యాడు. అక్కడ ఇగ్నాసియో కొరోనెల్ విలారియల్ (అలియాస్ ‘నాచో కొరోనెల్’), సీనియర్ సినాలో కార్టెల్ ఆపరేటివ్ వంటి డ్రగ్స్ ముఠా నాయకులతో మళ్లీ కలిశాడు.
Also Read: సినిమా రేంజ్లో డ్రగ్స్ మాఫియా డాన్ హతం.. తగలబడుతున్న మెక్సికో.. భారతీయులకు సూచన
కొరోనెల్ మరణం తరువాత, ఒసెగెరా 2009లో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ను స్థాపించి, సినాలో కార్టెల్ కు శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దాడు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి, వాటిలో 2022లో యునైటెడ్ స్టేట్స్ లో మత్తు పదార్థాల పంపిణీకి కుట్ర కేసు కూడా ఉంది.
ఎల్ మెన్చో తలపై రూ.136 కోట్ల రివార్డు
ఎల్ మెన్చో మెక్సికోలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. అమెరికాకు డ్రగ్స్ రవాణాదారుగా ఎల్ మెన్చో ఎదిగాడు. అతడి జాలిస్కో కార్టెల్‌ను అమెరికా ఉగ్ర సంస్థగా పరిగణించి, అతడి తలపై రూ.136 కోట్ల రివార్డు ప్రకటించింది.
చివరకు, నిన్న ఎల్ మెన్చో మెక్సికో ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో హింస చెలరేగుతోంది. రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి.
ఎల్ మెన్చో మరణ వార్త వెలువడిన గంటల్లోనే అతడి ముఠాకు చెందిన సాయుధులు వాహనాలను తగలబెట్టి హైవేలు మూసేశారు. భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగుతున్నారు. పలు రాష్ట్రాల్లో హింస చెలరేగుతోంది. ఎల్ మెన్చో చనిపోయాక కూడా మెక్సికో మంటల్లో కాలుతోంది. మెక్సికోలోని తమ పౌరులకు పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని, షెల్టర్లలోకి వెళ్లిపోవాలని చెప్పాయి.
