సినిమా రేంజ్లో డ్రగ్స్ మాఫియా డాన్ హతం.. తగలబడుతున్న మెక్సికో.. భారతీయులకు సూచన
ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో హింస చెలరేగి రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి.
Mexico: మెక్సికోలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ ముఠా నాయకుడు నెమెసియో రూబెన్ ఒసెగేరా సెర్వాంటెస్ (ఎల్ మెన్చో పేరుతో ప్రసిద్ధి) ఆర్మీ ఆపరేషన్లో హతమయ్యాడు. దీంతో ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో హింస చెలరేగి రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి.
మెక్సికో సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (అక్రమ వ్యాపారాలు నిర్వహించే శక్తిమంతమైన ముఠా) నాయకుడు ఎల్ మెన్చో (59) టాపల్పా వద్ద సైనికులతో జరిగిన కాల్పుల్లో గాయపడ్డాడు. అతడిని మెక్సికో సిటీకి తరలించే సమయంలో మరణించాడు.
Also Read: జాబ్ క్యాలెండర్ గురించి మంత్రి నారా లోకేశ్ గుడ్న్యూస్.. డీఎస్సీ పోస్టులపై కూడా..
మెక్సికోలో సంఘటిత నేరాలపై జరిగిన అత్యంత కీలకమైనదిగా ఈ ఆపరేషన్ను భావిస్తున్నారు. ఇంతకుముందు జోక్విన్ గుజ్మాన్, ఇస్మాయెల్ జాంబాడా గార్సియాలాంటి వారి అరెస్టులు జరిగినప్పుడు కూడా అటువంటి ముఠాలకు పెద్ద దెబ్బ తగిలింది. వీరు సినలోవా కార్టెల్ స్థాపకులు.
ఎల్ మెన్చో మరణ వార్త వెలువడిన గంటల్లోనే అతడి ముఠా గన్మెన్ వాహనాలు తగలబెట్టి హైవేలు మూసేశారు. భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగారు. దాదాపు 5 రాష్ట్రాలకు ఈ హింస విస్తరించింది.
మెక్సికోలోని తమ దేశాల పౌరులకు భారత్, అమెరికా, కెనడా భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. మెక్సికోలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు పేర్కొంది. షెల్టర్లలోకి వెళ్లిపోవాలని, తమ నుంచి తదుపరి నోటీసులు వచ్చేంత వరకు అక్కడే ఉండాలని చెప్పింది. సాయం అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని భారత్ పేర్కొంది.
