2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 209 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి.
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 209 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. 80వేల మందిని కరోనా బలితీసుకుంది. రోజురోజుకి కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. యావత్ ప్రపంచం కరోనా దెబ్బకి విలవిలలాడుతోంది. 209 దేశాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం:
ఈ వినాశనానికి కారణం చైనానే అనేది ప్రపంచ దేశాల ప్రజల ఆరోపణ. ప్రారంభ దశలోనే వైరస్‌ను చైనా కట్టడి చేసి ఉంటే ఇంతటి దుర్భర పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు. కానీ చైనా అలా చేయలేదని, దాని వల్ల ఇన్ని దేశాలు, కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారని వాపోతున్నారు. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. చైనాకి బుద్ధి చెప్పాలని కొందరు, గుణపాఠం నేర్పాలని మరికొందరు, ప్రతీకారం తీర్చుకోవాలని ఇంకొందరు అంటున్నారు. ఈ క్రమంలో #MakeChinaPay, #ChinaLiedPeopleDied అనే హ్యష్ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
#BoycottTikTok, #BoycottChineseProducts:
ఈ ప్రభావం భారత్‌లోనూ అధికంగానే ఉంది. వైరస్ వ్యాప్తికి కారణమైందన్న కోపంతో ఇప్పటికే అనేక మంది చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరిస్తున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను కూడా తాకింది. చైనాకి చెందిన టిక్ టాక్ ను బాయ్ కాట్ చేయాలని డిమాండ్లు పెద్ద ఎత్తున భారత్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది తమ మొబైల్స్ నుంచి తొలిగించేశారు కూడా. ఇంకొందరు రెడీ అవుతున్నారు. ఇందుకు #BoycottTikTok, #BoycottChineseProducts అంటూ చైనాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కరోనాను ‘చైనా వైరస్’ అని సంబోధించిన విషయం తెలిసిందే.
See Also | లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేస్తాం.. అఖిలపక్షంతో మోడీ.. కరోనా ప్రాంతాల్లో కొనసాగాల్సిందే
బ్యాన్ టిక్ టాక్:
అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యాప్ ని ఎవరూ వాడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కొందరు కోరుతున్నారు. టిక్ టాక్ ని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ లు ఎక్కువగా వినపడుతున్నాయి. బ్యాన్ టిక్ టాక్ పేరుతో ఓ ట్రెండ్ కూడా నడుస్తోంది. చాలామంది కరోనా వైరస్‌ను ప్రోత్సహిస్తూ… టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతున్నారనీ… అందువల్ల టిక్‌టాక్‌ను నిషేధించాలని కోరే వాళ్లూ ఉన్నారు.
చిన్న, పెద్ద అనే తేడా లేదు అంతా టిక్ టాక్ తెగ వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత. పొద్దున్న లేస్తే టిక్‌టాకుల్లో గడిపేస్తోంది. వినోదంతో పాటు కొంత విజ్ఞానాన్ని అందిస్తున్న టిక్ టాక్ భారతీయుల జీవితాల్లో మమేకమైపోయింది. అయినా భారమైన మనస్సుతో ఇప్పుడు మాకొద్దీ టిక్ టాక్ అని నినదిస్తున్నారు. మాకందరికీ కరోనాని అంటించి మా జీవితాలతో ఆడుకుంటారా అని చైనా మీద ఒంటి కాలిపై లేస్తున్నారు.
టిక్ టాక్ వాడే 800 మిలియన్లలో సగం మంది భారతీయులే:
‘చైనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం. భారత్ టిక్‌టాక్ వాడకాన్ని నిలిపివేస్తే చైనా దాదాపు రోజుకి 1 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతుంది, 250 మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోతారని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చైనా సంస్థ బైటెడెన్స్ యాజమాన్యంలో ఉన్న టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లు వాడుతుంటే, అందులో సగం మంది మన భారతీయులే ఉండడం విశేషం. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయులు రోజులో సగటున 52 నిమిషాలు పాటు టిక్‌టాక్‌లో గడుపుతున్నట్లు వెల్లడైంది.