India declares day of state mourning on Sept 11 over Queen demise
Queen Elizabeth II Death: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ దేశాధినేతలు, దిగ్గజ రాజకీయ నేతలు, క్రీడాకారులు, సినిమా వారు, వ్యాపారస్తులు, ఇతర రంగాలవారు, ప్రజల్లో పెద్ద స్థాయిలో ఆధారభిమానాలు ఉన్న అందరి నుంచి నివాళులు వస్తున్నాయి. కాగా భారత్ సైతం ఈ విషయమై సంతాపదినాన్ని ప్రకటించనుంది. సెప్టెంబర్ 11న దేశ వ్యాప్తంగా సంతాపదినం పాటించనున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది.
బ్రిటన్ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96 సంవత్సరాలు) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. క్విన్ ఎలిజబెత్-2 పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. క్విన్ విక్టోరియా పాలన (63సంవత్సరాల 7నెల 2 రోజులు) రికార్డును బద్దలు కొడుతూ బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్-2 రికార్డు సృష్టించారు.
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఎలిజబెత్ ను చూసేందుకు అప్పట్లో ప్రజలు బారులు తీరేవారు.