మరో భారత అమెరికన్‌కు కీలకపదవి

సుందర్ పిచాయ్.. సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ రంగంలో అత్యున్నత పదవులను అధిష్టించి అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు మరో భారత-అమెరికన్ అమెరికాలోని అత్యున్నత పదవి చేపట్టింది. అంతేకాదు ఈ పదవి చేపట్టిన తొలి మహిళగానూఘనత సాధించింది. అమెరికా ప్రభుత్వంలోని శక్తిమంతమైన ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)కు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీవో)గా భారత అమెరికన్‌ మోనిషా ఘోష్‌ సెలక్ట్ అయ్యారు. 

ప్రస్తుత సీటీవో ఎరిక్‌ బర్గర్‌ స్థానంలో జనవరి 13 నుంచి ఆమె బాధ్యతలు అందుకుంటారు. రేడియో, టీవీ, వైర్‌, ఉపగ్రహం, కేబుల్‌ ద్వారా సాగే అంతర్‌ రాష్ట్ర, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవహరాలను ఎఫ్‌సీసీ నియంత్రిస్తుంది. కాంగ్రెస్‌ పర్యవేక్షణలో నడిచే స్వతంత్ర సంస్థ. ఈ సంస్థపై అమెరికా కమ్యూనికేషన్లకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను అమలు చేసే బాధ్యత ఉంది. ఎఫ్‌సీసీ ఛైర్మన్‌గా భారత అమెరికన్‌‌గానే అజిత్‌ పాయ్‌ వ్యవహరిస్తున్నారు. టెక్నికల్, ఇంజినీరింగ్‌ అంశాలపై ఛైర్మన్‌కు సీటీవో సలహాలిస్తుంటారు. 

వైర్‌లెస్‌ రంగంపై అనేక ఆధునిక పరిశోధనలకు మోనిషా నాయకత్వం వహించారు. మెడికల్‌ టెలిమెట్రీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, టెలికాస్టింగ్ పెరామీటర్స్ వంటి అంశాల్లో ప్రత్యేక నైపుణ్యముంది. ఐఐటీ-ఖరగ్‌పుర్‌లో బీటెక్‌ చేసిన మోనిషా.. దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. షికాగో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ లెక్టరర్‌గా పనిచేశారు.