Hormuz Strait: హర్ముజ్ లో హైటెన్షన్.. భారత నౌకలపై ఇరాన్ అటాక్..
మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు శాంతిస్తున్నట్లు కనిపిస్తూనే అంతలోనే మళ్లీ రాజుకుంటున్నాయి. మరోసారి హర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్.
- Naveen
- Updated on- April 18, 2026 / 09:14 PM IST
- హర్ముజ్ జలసంధిలో కాల్పుల కలకలం
- భారత నౌకలపై ఇరాన్ సైనికుల కాల్పులు
- నౌకలు, అందులోని సిబ్బంది సేఫ్
- కాల్పులతో వెనుదిరిగిన 2 భారత నౌకలు
Hormuz Strait: హర్ముజ్ జలసంధిలో కాల్పుల కలకలం చెలరేగింది. భారత నౌకలపై ఇరాన్ సైనికులు కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో 2 భారత నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో భారత నౌకలు, అందులోని ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
హర్ముజ్ నుంచి భారత నౌకలను వెనక్కి పంపేసింది ఇరాన్ సైన్యం. హర్మూజ్ మూసివేత సమయంలో మన నౌకలు వెనక్కి తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిపారు. కాల్పుల దృష్ట్యా ఒమన్ కు ఈశాన్యంగా వెనక్కు మళ్లాయి భారత వాణిజ్య నౌకలు.
హర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన రెండు నౌకలపై ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయని. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం. చమురు వాణిజ్యానికి కీలకమైన ఈ నౌకా మార్గంలో జరిగిన ఈ ఘటన తర్వాత ఆ రెండు నౌకలు వెనుదిరగాల్సి వచ్చింది. రెండు నౌకలలో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (VLCC). భారీ పరిమాణంలో ఉంటుంది. సుదూర ముడి చమురు రవాణా కోసం దీన్ని రూపొందించారు.
భారత నౌకలపై కాల్పుల ఘటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. ఈ ఘటనపై భారత్ లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసిన కేంద్రం. ఇరాన్ రాయబారిని పిలిపించి మాట్లాడింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) త్వరలో ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉందని సమాచారం. కీలకమైన హర్ముజ్ జలమార్గంపై ఆంక్షలను తిరిగి విధించినట్లు ఇరాన్ ప్రకటించిన తర్వాత, జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన రెండు గన్‌బోట్లు కాల్పులు జరిపాయని అంతకుముందు బ్రిటీష్ సైన్యం కూడా తెలిపింది.
కాగా, మరోసారి హర్ముజ్ జలసంధి క్లోజ్ అయ్యింది. హర్ముజ్ ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇందుకు అమెరికా వైఖరే కారణం అని చెప్పింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దీనివల్ల అనేక వాణిజ్య నౌకలు ఈ కీలకమైన జలమార్గం గుండా వెళ్లే ప్రయత్నాలను విరమించుకోవాల్సి వచ్చింది.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు, సహజ వాయువులో ఐదవ వంతును మోసుకెళ్లే హర్ముజ్ జలసంధిని తెరిచినట్లు తెలిపింది. ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధనానికి ప్రతిస్పందనగా జలసంధిని మళ్లీ దిగ్బంధిస్తామని ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ తెలిపింది.
Also Read: మళ్లీ క్లోజ్.. హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసిన ఇరాన్..
