ఇండొనేషియాలో వరదలు.. 442 మంది మృతి.. ఇక శ్రీలంక, మలేషియా, థాయిలాండ్‌లోనైతే..
శ్రీలంకలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
- T Venkateshwarlu
- Published On : November 30, 2025 / 06:39 PM IST
Indonesia floods: ఇండొనేషియాలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 442కి పెరిగింది. ఇండొనేషియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడడం వంటి వాటి వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. ఇంటర్నెట్, విద్యుత్ కూడా కొంతవరకు మాత్రమే పనిచేస్తున్నాయి.
సెన్‌యార్ తుపాను వల్ల ఇండొనేషియాలో కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి, వేలాది భవనాలు మునిగిపోయాయి.
“ప్రవాహం చాలా వేగంగా వచ్చింది, కొన్ని సెకన్లలోనే వరద ఇళ్లలోకి చేరింది” అని ఇండొనేషియా ఆచె ప్రావిన్స్‌కు చెందిన అధికారులు అన్నారు. వరదల వల్ల తమ ఇంట్లోని అన్ని వస్తువలనూ కోల్పోయామని కొందరు చెప్పారు.
లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వందలాది మంది ఇంకా వరదల్లోనే ఇరుక్కుపోయారని ఇండొనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యంత ప్రభావిత ప్రాంతమైన టపనులిలో ఆహారం కోసం ప్రజలు దుకాణాలను దోచుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: వృద్ధుల కొంపముంచుతున్న స్మార్ట్‌ఫోన్లు.. వారు కొత్తగా ఈ ఊబిలో ఎలా కూరుకుపోతున్నారంటే?
శ్రీలంక, మలేషియా, థాయిలాండ్‌లో..
శ్రీలంక, మలేషియా, థాయిలాండ్‌లో కూడా భారీ వర్షాలు, వరదల ధాటికి వందల మంది మరణించారు. చాలా మంది అదృశ్యమయ్యారు. లక్షలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.
థాయిలాండ్‌లో అధికారికంగా మరణాల సంఖ్య 170గా నమోదైంది. మలేషియా ఉత్తర పెర్లిస్ రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. శ్రీలంకలో దాదాపు 190 మంది మృతి చెందారు.
థాయిలాండ్ దక్షిణ సాంగ్‌క్లా ప్రావిన్స్‌లో 145 మంది మరణించారు. ఇది దశాబ్దంలో వచ్చిన అత్యంత తీవ్ర వరదలలో ఒకటి. ముంపునకు గురైన 10 ప్రావిన్స్‌ల్లో 3.8 మిలియన్ మందికి పైగా ప్రభావితమయ్యారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. హాట్ యై నగరంలో ఒక్కరోజులో 335 మి.మీ వర్షపాతం నమోదైంది. 300 సంవత్సరాల్లో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే.
మలేషియాలో మరణాల సంఖ్య తక్కువ అయినప్పటికీ జరిగిన నష్టం మాత్రం తీవ్రతరంగా ఉంది. పెర్లిస్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, వేలాది మందిని షెల్టర్లకు తరలించారు.
శ్రీలంకలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 15,000 ఇళ్లకు పైగా ధ్వంసమయ్యాయి, 78,000 మంది తాత్కాలిక శిబిరాలకు వెళ్లారు. ఆ దేశంలో మూడో వంతు ప్రాంతానికి విద్యుత్, తాగునీరు అందడం లేదు.
