×
Ad

19 ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు.. పుతిన్ ఆస్తుల చిట్టా.. చూస్తే మైండ్ బ్లాంక్

వీటితో పాటు 700 మిలియన్ డాలర్ల విలువైన ఒక లగ్జరీ యాచ్ కూడా ఉందట. నల్ల సముద్రం ఒడ్డున 1 బిలియన్ డాలర్ల విలువైన ప్యాలెస్ ఉంది.

Vladimir Putin

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రెండు రోజులు ఇండియాలో ఉంటారు. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.

రక్షణ రంగానికి సంబంధించిన వాటితో పాటు ఇతరత్రా కొన్ని ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరగనున్నాయి. పుతిన్ టూర్ కి సంబంధించి, ఆయన ప్రయాణించే విమానం, కారు, బాడీ గార్డులు ఇలా చాలా స్టోరీలు చూసే ఉంటారు. ఇప్పుడు పుతిన్ ఆస్తులకు సంబంధించిన విషయాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

అధికారికంగా ప్రకటించిన ఆస్తుల ప్రకారం.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ జీతం 140000 అమెరికన్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో కోటి 20 లక్షల రూపాయలు. ఆయనకు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. మూడు కార్లు ఉన్నాయి. కానీ, అనధికారికంగా లెక్కిస్తే ఇది సముద్రంలో నీటి బొట్టు అంత అనే వాదన ఉంది.

Also Read: ఆల్‌ టైమ్‌ కనిష్ఠానికి రూపాయి.. అసలేం జరుగుతోంది? ఇలాగైతే ఎలా?

కొన్ని రిపోర్టులతో పాటు కొందరు చేసిన ఆరోపణల ప్రకారం పుతిన్‌ ఆస్తుల విలువ లెక్కలేనంత ఉంటుంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికన్ సెనేట్ ముందు ఆయన ఈ చిట్టా విప్పారు. దాన్ని బట్టి చూస్తే పుతిన్ నికర ఆస్తుల విలువ సుమారు 200 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు 18 లక్షల కోట్ల పైమాటే.

ఈ రకంగా చూస్తే ఎలాన్ మస్క్, బెజోస్ కంటే కూడా పుతిన్ రిచ్ అన్నమాట. 2003లో రష్యాలో ప్రముఖ వ్యాపారవేత్త అలిగార్క్ మిఖాయిల్ అనే వ్యాపారవేత్త అరెస్టయ్యారు. ఆ దెబ్బకు భయపడిన వ్యాపారవేత్తలు తమ ఆస్తుల్లో 50 శాతం పుతిన్ కి ఇచ్చేశారని ప్రచారం ఉంది.

ఇక పుతిన్ కి నల్లసముద్రం ఒడ్డున 1 బిలియన్ డాలర్ల విలువైన పుతిన్ ప్యాలెస్ ఉంది. అయితే, ఇది పుతిన్ పేరు మీద లేదు. ఆయన ఫ్రెండ్ పేరు మీద ఉంది. ఒక రకంగా ఆ ఫ్రెండ్ పుతిన్ కి బినామీ అని ప్రచారం ఉంది. ఈ ప్యాలెస్ లో పాలరాతి స్విమింగ్ పూల్, ప్రైవేట్ యాంఫీ ధియేటర్, అండర్ గ్రౌండ్ ఐస్ హాకీ రింగ్, క్యాసినోతో పాటు బాత్రూం కడగడానికి 850 డాలర్ల విలువైన ఇటాలియన్ టాయిలెట్ బ్రష్ లు కూడా ఉన్నట్టు టాక్.

పుతిన్ కి అనధికారికంగా సుమారు 19 ఇళ్లు, 700 కార్లు, 58 విమానాలు, 716 మిలియన్ డాలర్ల విలువైన ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనే ప్రత్యేక విమానం ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వీటితోపాటు 700 మిలియన్ డాలర్ల విలువైన ఒక లగ్జరీ యాచ్ కూడా ఉందట. పుతిన్ జీతం కంటే కూడా ఎక్కువ కాస్ట్ లీ అయిన వాచ్ ల కలెక్షన్ ఆయన దగ్గర ఉందట.