ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది.
ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది. 3రోజుల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది నిముషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం ఇంజన్లలో లోపం వల్లే ప్రమాదం జరిగిందని తొలుత ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా సహా పలు దేశాలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశాయి. విమానాన్ని క్షిపణి ఢీకొన్నందుకు సాక్ష్యంగా కొన్ని దృశ్యాలను విడుదల చేశాయి.
అయితే ఇరాన్ బ్లాక్‌బాక్సులు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. చివరకు ఉక్రెయిన్‌కు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. అయితే ఒత్తిడి పెరగడంతో తన తప్పును ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అదే సమయంలో టెహ్రాన్ నుంచి విమానం ఉక్రెయిన్‌కు బయలుదేరింది. ఈ సమయంలోనే ప్రమాదం జరిగింది. క్షిపణి ఢీకొనడంతో పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పాడు. కానీ అంతలోనే అది కుప్పకూలింది. మరణించిన 176మందిలో 82మంది ఇరాన్ పౌరులు కాగా… 63మంది కెనడా వాసులు ఉన్నారు.
ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం చెందారు. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. విమాన శకలాలు చల్లాచదురుగా పడివున్నాయి. మృతదేహాన్ని గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. విమానం బయల్దేరిన కొద్ది క్షణాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం కుప్పకూలిపోయింది.
స్థానిక కాలమానం ప్రకారం ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజ్‌లో తెలుస్తోంది. కాగా.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటలకే ఈ విమాన ప్రమాదం జరిగింది. అందరి అనుమానాలను నిజం చేస్తూ.. అది తమ పనేనని ఇరాన్ అంగీకరించింది.