Awacs Aircraft: అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్..? అత్యంత కీలకమైన, 700 మిలియన్ డాలర్ల ఖరీదైన విమానాన్ని పేల్చేశామని ప్రకటన..
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం ఇరాన్ ఆ స్థావరంపై ఆరు బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ దాడిలో కనీసం 15 మంది అమెరికా సైనికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
- Naveen
- Published On : March 30, 2026 / 12:26 AM IST
Awacs Aircraft: ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన విమానాన్ని పేల్చేశామని ఇరాన్ తెలిపింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి అమెరికా సైనిక ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన ఈ-3 సెంట్రీ (AWACS) నిఘా విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ విడుదల చేసింది.
ఇరాన్ ప్రెస్ టీవీ విడుదల చేసిన చిత్రాల్లో ఈ-3 సెంట్రీ విమానం మధ్య భాగం కాలిపోయి, తల, తోక భాగాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విమానం అమెరికాకు అత్యంత కీలకం. గగనతలం నుంచి నిఘా, శత్రువుల కదలికలను పసిగట్టడం దీని స్పెషాలిటీ. ప్రస్తుతం అమెరికా దగ్గర ఇలాంటివి 17 విమానాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ధ్వంసం కావడం అమెరికాకు పెద్ద నష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. E-3 సెంట్రీ అమెరికా పరిమిత విమాన సముదాయంలో ఒక భాగం. దీని ఖరీదు 700 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం ఇరాన్ ఆ స్థావరంపై ఆరు బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ దాడిలో కనీసం 15 మంది అమెరికా సైనికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
రియాద్‌కు సుమారు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌ను రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుండగా అమెరికా దళాలు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయి. దాదాపు నెల రోజుల క్రితం సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఈ బేస్ పలుమార్లు లక్ష్యంగా మారింది. ఈ వారం ప్రారంభంలో జరిగిన మరో దాడిలో 14 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. తమ సుప్రీం లీడర్ ని హత్య చేశారని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
Also Read: మరో జలసంధికి పొంచి ఉన్న ముప్పు..! దాన్ని కూడా మూసేస్తాం..! అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) March 29, 2026
