Iran Hangings: యువ రెజ్లర్ సహా ముగ్గురికి మరణశిక్ష.. బహిరంగ ఉరి.. ఇరాన్ సంచలనం
రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు, ప్రజలను భయపెట్టేందుకు ఈ ఉరిశిక్షలు అమలు చేశారని మండిపడింది. వీటిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేసింది.
- Naveen
- Published On : March 20, 2026 / 05:00 PM IST
Representative Image (Image Credit To Original Source)
- అంతర్గత అసమ్మతిపై ఇరాన్ ఉక్కుపాదం
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై సీరియస్
- నిరసనలతో సంబంధం ఉన్న ముగ్గురికి మరణశిక్ష
- యువ రెజ్లర్ సహా ముగ్గురికి బహిరంగ ఉరి
Iran Hangings: ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలను ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. అసమ్మతిపై ఉక్కుపాదం మోపుతోంది. అసమ్మతి అణచివేతను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా నిరసనలతో సంబంధం ఉన్న ముగ్గురికి మరణశిక్ష అమలు చేసింది. కోమ్ నగరంలో ప్రజల మధ్య వారిని బహిరంగంగా వారిని ఉరితీసింది. మరణ శిక్ష పడ్డ వారిలో ఒక యువ రెజ్లర్ కూడా ఉన్నాడు.
2025 డిసెంబర్ లో ఇరాన్ లో నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను నిరసిస్తూ మొదలైన నిరసనలు నెల రోజులు పాటు కొనసాగాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో (2026 జనవరి 8) ఇద్దరు పోలీసులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో సాలేహ్ మహమ్మదీ, సయీద్ దావోది, మెహ్ దీ ఘాసెమీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరిలో సాలేహ్ వయసు 19ఏళ్లు. అతడు యువ రెజ్లర్. ఆ నిరసనల్లో భాగమైన ఈ ముగ్గురిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఆ ముగ్గురు యువకులు ఇజ్రాయెల్, అమెరికా తరపున పనిచేశారని ఇరాన్ ఆరోపించింది.
దీనిపై ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఇదే తరహాలో మరికొన్ని మరణశిక్షలు అమలు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఘటనలో విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపణలు చేసింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు, ప్రజలను భయపెట్టేందుకు ఈ ఉరిశిక్షలు అమలు చేశారని మండిపడింది. నిరసనకారులను హింసించి, బలవంతంగా ఒప్పించారని వాపోయింది. అత్యంత అన్యాయంగా ఆ ముగ్గురిని ఉరి తీశారంది. దీన్ని తాము హత్యలుగానే పరిగణిస్తామంది. ముందు ముందు భారీగా నిరసనకారులను ఉరితీసే ప్రమాదం ఉందని, ఈ దారుణాలను అడ్డుకోడానికి తక్షణమే స్పందించాలని ఇరాన్ హ్యుమన్ రైట్స్ సంస్థ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న వారికి ఇరాన్ మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. ఖోమ్ నగరంలో ప్రజల సమక్షంలో ఈ ఉరిశిక్షలు అమలు చేశారు. 2025 డిసెంబర్ చివరలో ప్రారంభమైన ప్రజా నిరసనలు 2026 జనవరి వరకు కొనసాగాయి. దేశవ్యాప్తంగా అశాంతికి దారితీశాయి.
ఎవరీ సాలేహ్ మహమ్మదీ?
సాలేహ్ మహమ్మదీ 2007లో జన్మించాడు. చిన్న వయసులోనే రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. సెప్టెంబర్ 2024లో రష్యాలోని క్రాస్నోయార్స్క్‌లో జరిగిన సైతియేవ్ అంతర్జాతీయ కప్‌లో ఇరాన్ జాతీయ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ జట్టు తరపున బరిలోకి దిగి కాంస్యం గెలుచుకున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు.
Also Read: యుద్ధంలో కీలక మలుపు.. రంగంలోకి ఎ-10, అపాచీలు.. హర్మూజ్‌ను తెరిచేందుకు ఆపరేషన్ షురూ..
