Iran vs Israel War : యుద్ధంలో కీలక మలుపు.. రంగంలోకి ఎ-10, అపాచీలు.. హర్మూజ్‌ను తెరిచేందుకు ఆపరేషన్ షురూ..
Iran vs Israel War : ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్ జలసంధిని మళ్లీ యథాస్థితికి తెచ్చేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది.
Iran vs Israel War
- హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా దృష్టి
- రంగంలోకి ఎ-10, అపాచీ హెలికాప్టర్లు
- హర్మూజ్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహం
Iran vs Israel War : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతోపాటు.. చమురు నిల్వలపై దాడి చేస్తోంది. అంతేకాదు.. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది.
ఇరాన్ హెచ్చరికలు కాదని ముందుకెళ్లిన నౌకలపై బాంబులతో పేల్చేస్తోంది. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్ జలసంధిని మళ్లీ యథాస్థితికి తెచ్చేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను రంగంలోకి దింపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్స్, బోట్స్, మిస్సైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు అమెరికా సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఈ ప్రాంతాన్ని దిగ్భందిస్తూ ఇరాన్ పరిచిన ఉచ్చులను పూర్తిగా తొలగించేందుకు అమెరికా సైన్యం పనిచేస్తోంది. భారీ ఆయుధాలతో ఏ-10 యుద్ధ విమానాలకు తోడు అపాచీ అటాక్ హెలికాప్టర్లను కూడా పంపించింది.
ఇవి హర్మూజ్ జల సంధిపై అతితక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుల లక్ష్యాలను మట్టుబెడుతున్నాయి. అంతేకాదు.. ఎ-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి ఇప్పటికే దాదాపు రెండు వేల మందికిపైగా అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరు ఇరాన్ దక్షిణతీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకొని హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇరాన్‌ను గట్టి దెబ్బకొట్టాలంటే ఆ దేశంలోని చమురు నిల్వలతోపాటు.. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలని అమెరికా భావిస్తుంది. ఈక్రమంలో హర్మూజ్ జలసంధిని తమ ఆదీనంలోకి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
